వినాయక చవితి అనగానే ఠక్కున గుర్తొచ్చేది.. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. దేశవ్యాప్తంగా ఖైరాబాద్ గణేశుడిపైనే అందరి చూపు ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా వాడవాడలా గణుశుడి విగ్రహాలు పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో గణేశుడి శోభయాత్ర సాగే తీరు హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచస్థాయిలో చిరస్థాయిగా నిలబెడుతుంది. అయితే ఈసారి కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో వినాయక చవితిపైనే ప్రభావం కన్పించేలా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కేసుల సంఖ్య మరింత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ మహానగరంలో గణేశుడి విగ్రహాలు గతంలో మాదిరిగి అధిక సంఖ్యలో ఏర్పాటు చేసే అవకాశాలు లేవు.
గతేడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు పూజలు అందుకున్నాడు. కానీ ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 27 అడుగులకే పరిమితం అయ్యాడు. గతేడాది 65 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడు ఈ సంవత్సరం ఏకంగా 38 అడుగులు తగ్గి 27 అడుగుల ఎత్తులోనే దర్శనం ఇవ్వనున్నాడు. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ప్రతి ఏటా వివిధరూపాల్లో దర్శనమిచ్చే ఖైరాతాబాద్ గణేశుడు ధన్వంతరి వినాయకుడిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భక్తులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా సైతం దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.