Home /News /telangana /

Singareni Mines: నల్ల బంగారు లోకం.. మరో వందేళ్లైనా బొగ్గుకు బేఫికర్‌!

Singareni Mines: నల్ల బంగారు లోకం.. మరో వందేళ్లైనా బొగ్గుకు బేఫికర్‌!

ప్రతీకారాత్మక చిత్రం

ప్రతీకారాత్మక చిత్రం

Singareni Mines: సింగరేణి సంస్థ తన ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగం ద్వారా చేయించిన పరిశోధనల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 11,394.76 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు తాజాగా గుర్తించారు. దాన్ని వెలికితీస్తే రాబోయే వంద ఏళ్లకు పైగా మనకు సరిపోతుందని సింగరేణి సంస్థ అంచనా వేస్తోంది.

ఇంకా చదవండి ...
  సింగరేణి.. తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన తరగని సిరి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు ప్రాణాలు తెగించి పని చేసి మన ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. మరి ఆ బొగ్గు అయిపోదా? మనలో ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఇలాంటి సందేహం వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే ఆ భయం అక్కర్లేదు. అవును సింగరేణి సంస్థ తన ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగం ద్వారా చేయించిన పరిశోధనల్లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 11,394.76 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు తాజాగా గుర్తించారు.

  ఇప్పటికే అందుబాటులో ఉన్న భూగర్భ, ఓపెన్‌ కాస్ట్‌ గనులు పోను గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు చేసి బొగ్గును వెలికితీస్తే అది మనకు రాబోయే వంద నుంచి నూట యాభై ఏళ్ల దాకా సరిపోతుందని సింగరేణి సంస్థ అంచనా వేస్తోంది. ఇప్పటికే సింగరేణి సంస్థ ఆరు జిల్లాల్లో 29 భూగర్భ గనులు, మరో 19 ఓపెన్‌ కాస్ట్‌ గనుల నుంచి బొగ్గును వెలికితీస్తోంది. ఇలా ఏటా కేవలం 64 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే తోడగలుగుతోంది. గోదావరి లోయలోని భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న ఈ నల్లబంగారం నిల్వలు మరో నూట ఏభై సంవత్సరాల దాకా తవ్వినా తరగని పరిస్థితి ఉందంటే మన కరెంటుకు బేఫికర్‌ అని చెప్పుకోవచ్చు.

  అయితే బొగ్గు సమృద్ధిగా ఉంది కదా అని.. దాన్ని అదేపనిగా వాడుకుంటూ కరెంటు ఉత్పత్తి చేస్తే పర్యావరణం పరిస్థితి ఏంటన్న ప్రశ్న సైతం ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అయితే నికరంగా ఉన్న ఈ నిల్వలను జాగ్రత్తగా వాడుకుంటూ.. పర్యావరణ హితమైన జల, వాయు, సౌర విద్యుత్ ను మరింతగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నది పర్యావరణవేత్తల మాట. అయితే పైన పేర్కొన్న అన్నీ కూడా సీజనల్‌ కావడంతో.. అనివార్యంగా బొగ్గుపై ఆధారపడిన థర్మల్‌ విద్యుత్ వైపు వెళ్లక తప్పని పరిస్థితి ఉంది. ఇప్పటికే విదేశాల్లోనూ బొగ్గు తవ్వకాలకు సంబంధించిన కాంట్రాక్టులు సంపాదించే పనిలో పడిన సింగరేణి అధికారులు తాజాగా నిల్వలపై సీరియస్‌గా దృష్టి సారించారు.

  జీపీఎస్‌ తో కూడిన అధునాతన వాహనాలు, సాంకేతిక పరికరాల సాయంతో నిర్వహించిన పరిశోధనలలో భారీ నిల్వలున్నట్టు వెల్లడైంది. ఉపరితలానికి 300 మీటర్ల లోపే వేల మిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురంభీం, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో ఈ నిల్వలున్నట్లు తేలింది. నాణ్యతా పరమైనగ్రేడింగ్‌లో చూస్తే సింగరేణి గుర్తించిన కొత్త ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫ్‌ రకం బొగ్గు ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో వచ్చే రోజుల్లో కొత్తగా మరో ఆరు ఓపెన్‌ కాస్ట్‌ గనులు తవ్వడానికి సింగరేణి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రమాదకరమైన భూగర్భ గనుల స్థానంలో మెషినరీతో తవ్వకాలు చేసే ఓపెన్‌ కాస్ట్‌ బెస్ట్‌ అన్న అభిప్రాయంతో సింగరేణి అధికారులు ముందుకెళ్తున్నారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Khammam, Singareni, Singareni Collieries Company, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు