THE MEDICAL HEALTH DEPARTMENT HAS CLARIFIED THE NEWS THAT A FOURTH WAVE IS LIKELY TO HIT TELANGANA AS CORONA CASES ARE ON THE RISE IN NORTHERN INDIA PRV
Corona Fourth Wave: తెలంగాణలో కరోనా నాలుగో వేవ్ వస్తుందా? వైద్యారోగ్య శాఖ ఏమంటోంది?
ప్రతీకాత్మక చిత్రం
చైనాలో కొత్త రకం కరోనా కోరలు చాస్తోంది. చాలా ప్రదేశాల్లో లాక్డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి. దీంతో తెలంగాణలోనూ నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందని పలువురుచెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వైద్యాధికారులు క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ (Telangana)లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని, అయినా అప్రమత్తంగానే ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ (medical health department) సూచించింది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని కోరారు. పెళ్లిల్లు, ఇతర విందులు, సామూహిక కార్యక్రమాలు, విహార యాత్రలు నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని, వాయిదా వేయాల్సిన అవసరం లేదని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) శ్రీనివాసరావు (Srinivasa Rao) స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల్లో 92.9% మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందని.. రెండు డోసుల వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిందని.. అందువల్ల కరోనా నాలుగో వేవ్ (Corona Fourth wave) వచ్చే అవకాశం తక్కువేనని ఆయన స్పష్టం చేశారు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలను ఇప్పించాలని, 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. 18–59 ఏళ్ల మధ్య వారికి ఉచితంగా బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, అనుమతి రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు.
పాజిటివిటీ రేటు 0.14 శాతమే..
ఒకవేళ నాలుగో వేవ్ (Corona Fourth wave in Telangana) వచ్చినా దాని ప్రభావం స్వల్పమేనని.. కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ సాధారణ జలుబు మాదిరే ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు (Corona cases) పెరుగుతున్న నేపథ్యంలో అటువైపుగా వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనూ ముందుజాగ్రత్తగా కొంచెం అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా తిరిగే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. ఐటీ కంపెనీలు వందశాతం సిబ్బందితో పనిచేయాలని సూచించారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దానిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.14 శాతమేనని.. రోజూవారీ కేసుల సంఖ్య 20–25 మధ్య నమోదవుతోందని చెప్పారు.
నాలుగో దశ వచ్చే అవకాశం తక్కువ..
శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... గత జనవరి 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీరో సర్వే నిర్వహించారని తెలిపారు. అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 89.2 శాతం మందిలో.. అత్యధికంగా హైదరాబాద్లో 97 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. ఒకడోసు తీసుకున్న 91.4 శాతం మందిలో, రెండు డోసులు తీసుకున్న 96 శాతం మందిలో.. అసలు వ్యాక్సిన్ తీసుకోనివారిలో కూడా 77 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని తెలిపారు. ఈ లెక్కన రాష్ట్రంలో కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం తక్కువ’’ అని శ్రీనివాసరావు చెప్పారు.
లక్షణాలు స్వల్పంగానే..
కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ ఇప్పటివరకు ఢిల్లీ, మహారాష్ట్రల్లో నమోదైందని.. దాని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా సాధారణఫ్లూ దశకు చేరుకుంటుందని తెలిపారు. అప్పుడే కరోనా కథ ముగిసిపోయిందని అనుకోవద్దని, ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం, మాస్కు పెట్టుకోవడం, టీకాలను తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.