(న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి)
మళ్లీ ఆడపిల్లలే (Baby girl) పుట్టింది అనే నిట్టూర్పులు. అందరూ ఆడపిల్లలయితే ఏం పెట్టి పెద్ద చేయాలి అనే నిష్టూరాలు .. ఆడపిల్లలు ఉన్నోడు అష్ట దరిద్రుడేనా అనే ఆందోళనలు.. బిడ్డల పెళ్లిళ్లు చేయలేక ఇంత విషం తాగి సచ్చుడెనా అనే ఆవేదనలు . ఈ మాటలు ఇంకెంత కాలం వినాలి. అమ్మాయి పుడితే అరిష్టం అని ఇంకెన్నాళ్లు నమ్మాలి. పురిట్లో శిశువుని దూరం చేయడం. పెళ్లీడుకు వచ్చినంక చావడం. ఇవేనా మనం చేయాల్సింది. రండి అందరం ఒక్కటై మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డను రక్షించుకుందాం.. అంటూ కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ఓ గ్రామం నుంచి మొదలైంది ఓ ఉద్యమం. నిజంగా ఆ ఊరు గురించి చెప్పాలంటే ఏదో తెలియని సంతోషం.. మరేదో ఆనందం.. గర్వం.. ఈ ఊరు ఉద్యమంపై న్యూస్ 18 ప్రత్యేక కథనం..
ఆడపిల్ల పుడితే ఊరంతా సంబురం..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి ఊరు చిన్నదే అయినా .. ఆ గ్రామస్తుల మనసు చాలా పెద్దది . ఎంత పెద్దదంటే తమ పల్లెలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక చేయూత అందించేంత ఎత్తుకు ఎదిగారు. ఇప్పటికీ ఎంతోమంది ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. పెళ్లీడుకు వస్తున్న అమ్మాయిని చూసి గుండె మీద కుంపటిలా చూస్తున్నారు. అప్పులు చేసి మరీ ఆడబిడ్డ పెండ్లి చేస్తున్నారు కానీ కొండాయపల్లి (Kondayapalli) వాసులు మాత్రం ఇందుకు భిన్నం. ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే ఇంట్లో వాళ్లే కాదు ఊరంతా సంబరపడుతోంది. ఈ ఆనందం వెనుక మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ (Mahalakshmi Foundation) ఉన్నది.
ఏదో ఒకటి చేయాలని..
కొండాయపల్లి గ్రామానికి చెందిన రేండ్ల శ్రీనివాస్ ఆలోచనకు ప్రతిరూపమే మా ఊరి మహాలక్ష్మీ ఫౌండేషన్, కొండాయపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆడపిల్ల పెండ్లి చేయలేక ఒకరిద్దరు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు శ్రీనివాస్ ను కలచి వేశాయి. తగినంత కట్నం ఇవ్వలేక పెండ్లయిన ఆడ పిల్లలు కూడా ఇంటి వద్ద ఉండిపోయిన సందర్భాలు చూశారు . దీనికి పేదరికమే ప్రధాన కారణమని గ్రహించారు . ఆడపిల్ల అంటే ఎవరూ చిన్నచూపు చూడకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ఏదో ఒకటి చేయాలని తలచారు .ఇక్కడి నుండి వెళ్లి విదేశాల్లో ఉంటున్నవారు, అలాగే , ముంబై , భీవండి లాంటి నగరాల్లో ఉపాధి పొందుతున్న వారిని ఏకం చేసి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరారు . గ్రామస్తులను చైతన్యవంతం చేసి మా ఊరి మహాలక్ష్మి పౌండేషన్ అంకురార్పణ చేశారు.
2018 లో శ్రీరామనవమి రోజున మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ను శ్రీనివాస్ ప్రారంభించారు . 2017 లో గ్రామంలో మొత్తం 10 మంది ఆడపిల్లలు పుట్టారు . నిధుల లేమితో ఇద్దరికి మాత్రమే ఆర్థిక సాయం చేశారు . గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక సహాయం చేయాలంటే భారీగా నిధులు అవసరం కావడంతో విదేశాల్లో ఉంటున్న వారితో పాటు గ్రామానికి చెందిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువకుల, నుంచి విరాళాలు సేకరిస్తున్నారు .
మరో ఐదు వేలు కలిపి..
2019 లో గ్రామంలో పుట్టిన ఏడుగురు ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించారు . 2020 లో గ్రామంలోని పది మంది ఆడపిల్లల పేరిట 5 వేల చొప్పున పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేశారు . 2021లో 12 మందికి బ్యాంకు సంబంధించిన పాస్ పుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ , కలెక్టర్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అందించారు. ఫౌండేషన్ ఐదువేలతో పాటు తల్లిదండ్రులు మరో ఐదు వేలు కలిపి మొత్తం 10 వేలు ఆడపిల్ల పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో డిపాజిట్ చేస్తున్నారు . ఇప్పటివరకు 30 మంది ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందించారు .రానున్న రోజుల్లో గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఐదువేలు అందజేయడంతో పాటు పేదింటి యువతులకు కూడా పెళ్లి ఖర్చులు కోసం 50,000 రూపాయల ఆర్థికసాయం చేయడమే లక్ష్యంగా తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని శ్రీనివాస్ చెప్పారు. ఆడబిడ్డల పెండ్లిళ్లు తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ఫౌండేషన్ ఉద్దేశమన్నారు. దీనికి స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామస్తులు సహకరిస్తున్నారని ఫౌండేషన్ అధ్యక్షురాలు గోవిందమ్మ సభ్యురాలు అరుణ తెలిపారు.
మా గ్రామం తరపున పుట్టిన ఆడబిడ్డకు 5 వేల ఆర్థిక సాయం చేస్తే .. సీఎం కేసీఆర్ ఓ మేనమామ లాగా కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ స్కీం ద్వారా లక్ష నూట పదహార్లు పెండ్లికి కట్నంగా అందిస్తున్నారని చెప్పారు . మా ఊరి మహాలక్ష్మీ ఫౌండేషన్‌కు మా వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నామని స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు మా ఊరి మహాలక్ష్మీ ఫౌండేషన్ ఐదు వేల ఆర్థిక సాయం చేస్తుందని తల్లులు చెబుతున్నారు . ఆడబిడ్డ పుట్టగానే ట్రస్టు తరపున ఐదు వేలు , తల్లిదండ్రుల తరపున మరో ఐదు వేలు కలిపి మొత్తం 10 వేలు ఫోస్టాఫీసులో డిపాజిట్ చేపిస్తున్నారని తెలిపారు . ఇది చిన్నమొత్తమే అయినా పిల్లలు పెండ్లీడుకు వచ్చేసరికి తమకు ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
ఈ ఫౌండేషన్ ధ్వరా ఈ ఒక్క ఊరే కాకుండా చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా ట్రస్ట్ ద్వారా 5,000 ఇవ్వాలన్నదే తమ లక్ష్యం అని ట్రస్ట్ నిర్వాహకుల కోరిక. సొంత మనుషులే ఆదుకోని ఈ కలికాలంలో శ్రీనివాస్ మా ఊరి మహాలక్ష్మీ సంస్థ స్థాపించి , ఆడపిల్ల పుడితే ఐదు వేలు సాయం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు . కొండాయపల్లిలోని మా ఊరి మహాలక్ష్మీ పౌండేషన్ స్ఫూర్తిని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్‌లో పురిట్లోనే ఆడపిల్లల మరణాలు ఉండవు . ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందనే రోజులు వస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Baby sister, Karimnagar, WOMAN