తెలంగాణ (Telangana)లో వైద్య విద్య మరింత మందికి అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాదికల్లా మెడికల్ కాలేజీల (Medical colleges) సంఖ్య 50కి చేరనుంది. తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 34 వైద్య కళాశాలలున్నాయి. వీటిలో 5265 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 8 కళాశాలలను నిర్మిస్తోంది. ఆ పనులు (Works) వేగంగా జరుగుతున్నాయి. ఈ కాలేజీల్లో జాతీయ వైద్య మండలి తొలి విడత తనిఖీలు కూడా పూర్తయ్యాయి. ఇక ప్రైవేటులో మరో 4 కాలేజీలు రానున్నాయి. ఆపై ఏడాది మరో 4 కళాశాలలను ఏర్పాటు చేస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఫలితంగా రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తం 50 మెడికల్ కాలేజీలు అవుతాయి.
కసరత్తు మొదలు..
అయితే ఈ 8 నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టారు అధికారులు. జిల్లాకో మెడికల్ కాలేజీ (Medical college for District)ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో మరో 8 కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కూడా కేటాయించింది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి (Kamareddy), కరీంనగర్, ఖమ్మం (Khammam), కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తారు.
ఆసుపత్రులు, పడకల వివరాలు సేకరణ..
2023-24 విద్యాసంవత్సరానికి అందుబాటులోకి వచ్చేలా 100 ఎంబీబీఎస్ అడ్మిషన్లకు (MBBS admissions) తగిన వసతులు కల్పిస్తారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం 100 ఎంబీబీఎస్ అడ్మిషన్లకు కనీసం 430 పడకలు అందుబాటులో ఉండాలి. దానికోసం ప్రస్తుతం ఉన్న దవాఖానల అప్‌గ్రేడేషన్, నూతన భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల వివరాలు (Hospital details), అదనంగా ఏర్పాటు చేయాల్సిన పడకల సంఖ్యను (Beds numbers)వైద్య విద్య విభాగం సేకరిస్తోంది. వీటిని టీఎస్ఎంఎస్ఐడీసీకి (TSMSIDC) పంపి, వసతుల కల్పనకు బడ్జెట్ అంచనాలు రూపొందించాలని సూచించింది. కాలేజీ భవనాలు (College Buildings), హాస్టల్ భవనాలు, పరికరాలు వంటివాటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలని కోరింది. 8 జిల్లాల్లో కలిపి అప్‌గ్రేడేషన్‌కు (Upgradation) అదనంగా 935 పడకలు అవసరం అవుతాయని అధికారులు లెక్కించారు.
ఇక బ్యాడ్‌న్యూస్ ఏంటంటే..?
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒక్కో మెడికల్ కాలేజీలో వంద సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కాలేజీని 150 సీట్లతో ఏర్పాటు చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ, వంద సీట్లకే ప్రతిపాదనలు రూపొందించారు. నేషనల్ మెడికల్ కమిషన్ రూల్ ప్రకారం 150 సీట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేయాలంటే, దానికి అనుబంధంగా కనీసం 500 బెడ్ల హాస్పిటల్ ఉండాలి. కానీ, మన దగ్గర మెడికల్ కాలేజీలుగా మారుస్తున్న హాస్పిటళ్లలో ఆ స్థాయిలో బెడ్లు లేవు. వంద సీట్ల కాలేజీ మంజూరుకు కనీసం 430 బెడ్ల హాస్పిటల్ ఉంటే సరిపోతుంది. మన దగ్గర ఒక్క కరీంనగర్ హాస్పిటల్ మినహా ఇంకెక్కడా ఇన్ని బెడ్లు లేవు. ఖమ్మం జిల్లా హాస్పిటల్లో 400 బెడ్లు ఉండటంతో మరికొన్ని బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్, కామారెడ్డి, జనగామ హాస్పిటళ్లలో 150 బెడ్ల చొప్పున మాత్రమే ఉన్నాయి. ఆయా హాస్పిటళ్లలో కొత్తగా 280 బెడ్లు చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆసిఫాబాద్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన్లలోనూ మెడికల్ కాలేజీలకు అవసరమైనన్ని బెడ్లు లేవు. దీంతో 150 ఎంబీబీఎస్ సీట్లకు బదులు, వంద సీట్లతోనే కాలేజీలు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికి సమాచారం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medical colleges, Neet exam, Telangana