THE GOVERNMENT HAS RELEASED RS 250 CRORE TO IMPLEMENT DALIT BANDHU AS A PILOT PROJECT IN 4 ZONES IN TELANGANA VB
Chief Minister KCR: దళితులకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.250 కోట్లు విడుదల..
సీఎం కేసీఆర్ (ఫైల్)
Chief Minister KCR: తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదటగా ప్రభుత్వం.. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలోని 4 మండలాల్లో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) దళిత బంధు పథకం(Dalit Bandhu Scheme) కింద.. ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించినప్పటికీ.. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో దీనిని అమలు చేస్తోంది. ఎన్నికల ముందు 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు జమచేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు విడతల్లో దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.1,200 కోట్లను లబ్ధిదారులకు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు కేవలం హుజురాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా.. కొత్తగా నాలుగు మండలాల్లో దళిత బంధు అమలుపై సమీక్షించి అక్కడ కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలను గౌరవించి.. వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులకు అనుగుణంగా.. దళితబంధును విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెలంగాణ నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు కేసీఆర్ వివరించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోని తూర్పు దిక్కున మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే 4 మండలాల్లో దళిత బంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల తెలంగాణ ప్రభుత్వం. చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా 3 మండలాలకు రూ.50 కోట్ల చొప్పున ఇచ్చింది.
ఇప్పటికే ఆయా మండలాల్లో దళిత బంధు ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్లు అవగాహన సదస్సులు నిర్వహించారు. దళిత కుటుంబాల గణన చేపట్టాలని ఎస్సీ కార్పొరేషన్ కలెక్టర్లకు సూచించింది. అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రతి ఏటా 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేసేలా 20 వేల కోట్లను కేటాయిస్తామని తెలియజేశారు. త్వరలో రాష్ట్రంలో ప్రతీ మండలంలో అర్హులైన ఎస్సీలకు దళితబంధు పథకం అమలు చేసే దిశగా అడుగులు వేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.