(న్యూస్ 18, మహబూబ్ నగర్, సయ్యద్ రఫీ)
రంజాన్ (Ramadan 2022) పవిత్ర మాసం సందర్భంగా ఈ నెల 3 నుంచి మే 3 వరకు ఆయా శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లను చేయాల్సిందిగా మహబూబ్నగర్ (Mahbubnagar) జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన "రంజాన్ కో-ఆర్డినేషన్ కమిటీ" సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం (Muslim) సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నెలరోజులపాటు నిర్వహించుకునే రంజాన్ పండుగ సందర్భంగా శాంతిభద్రతలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలపై ఆయా శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రంజాన్ పండుగ నిర్వహణ, తీసుకోబోయే చర్యలపై 2,3 రోజుల్లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సమావేశానికి మత పెద్దలతో (Elders) పాటు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ (Minister srinivas goud) ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు అధికారులు రానున్న రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి సమర్పించాలన్నారు.
రెండు విడతలుగా విధులు..
రంజాన్ తోపాటు, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, తదితర వేడుకలకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో "మల్టీ డిసిప్లినరీ కంట్రోల్ రూమ్(Multi-disciplinary control room)" ఏర్పాటు చేయాలని, ఈ కంట్రోల్ రూమ్ లో పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ,మున్సిపల్ తదితర ఉద్యోగులను నియమించనున్నారు. ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు రెండు విడతలుగా విధులు నిర్వహించే లా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నెల రోజుల పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
దుస్తుల పంపిణీ, ఇఫ్తార్ విందు..
మహబూబ్ నగర్, జడ్చర్ల,భూత్ పూర్ మున్సిపాలిటీ లో పెద్ద పెద్ద మసీదు లు ఉన్న చోట సౌకర్యాల కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అన్నిచోట్ల అంబులెన్సులను సిద్ధంగా ఉంచడం, ఆర్ డి ఓ అధ్యక్షతన జిల్లా మైనారిటీ శాఖ అధికారి కో-ఆర్డినేటర్ గా డిఎస్పీ, రెవెన్యూ అధికారులు ఉండేలా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ ద్వారా రంజాన్ సందర్భంగా దుస్తుల పంపిణీ, ఇఫ్తార్ విందు ఏర్పాటు వంటివి చూడాలని తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో పది వార్డులకు ఒక టీం ను ఏర్పాటు చేసి శానిటేషన్, తాగునీటి సమస్య లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
అన్ని పెద్ద పెద్ద మసీదుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రాత్రి సమయాలలో కూడా షాపులు తెరిచే ఉంచేలా ఇదివరకే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవిన్యూ అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, అడిషనల్ ఎస్ పి రాములు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి, ఇతర సంబంధిత శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేసే పనుల పై వివరించారు. జిల్లా అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, Ramadan 2022