news18-telugu
Updated: July 16, 2020, 1:59 PM IST
కనువిందు చేస్తున్న జలపాతాలు
ఆదిలాబాద్ : పచ్చని అడవుల మధ్య ఎత్తైన గుట్టలపై నుంచి వయ్యారాలు ఒలకబోస్తూ నురగలు కక్కుతూ కిందకు జాలువారుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాల అందాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. తమ అందాలతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. పేరుగాంచిన పెద్ద పెద్ద జలపాతాలే కాకుండా ఈ వర్షాకాలం మాత్రమే కనిపించే చిన్న చిన్న జలపాతాలు కూడా కనువిందు చేస్తున్నాయి. వరుసగా రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి తోడు, ఎగువ ప్రాంతాల నుండి కొనసాగుతున్న వరద ఉధృతికి ఆయా జలపాతాలు జల కళను సంతరించుకుంటున్నాయి. కొండల మీది నుండి శబ్దం చేస్తూ కిందికి దూకుతూ కనువిందు చేస్తున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే పేరుపొందిన కుంటాల జలపాతం నిన్నమొన్నటి వర్షానికి ఉరకలువేస్తూ, గలగల సవ్వడి చేస్తూ ముచ్చటగొల్పుతోంది. బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతానికి నీటి ప్రవాహం పెరిగి పరవళ్లు తొక్కుతోంది. ఇంకా నేరడిగొండ మండలం కొరిటికల్, బజార్ హత్నూర్ మండలంలోని కనకాయి, ఆదిలాబాద్ మండలం ఖండాల ప్రాంతంలోని మొలాలగుట్ట, ఇచ్చోడ మండలంలోని గాయత్రి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సప్తగుండాల, పాలోది జలపాతాలు వరుసగా కురుస్తున్న వర్షానికి జలకళను సంతరించుకొని చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
అయితే కోవిడ్ నేపథ్యంలో ప్రఖ్యాత కుంటాల జలపాతంతోపాటు కనకాయి, గాయత్రి, పారాఖప్పి, సప్తగుండాల జలపాతాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. కేవలం పొచ్చెర, గుండాల జలపాతాలు మాత్రమే పర్యాటకులు తిలకించేందుకు అందుబాటులో ఉన్నాయి.
Published by:
Venu Gopal
First published:
July 16, 2020, 1:57 PM IST