Mahabubabad: దేశానికి అన్నం పెట్టె రైతు పరిస్థితి నానాటికి దిగజారుతూ వస్తుంది. పండిన పంటకు పెట్టుబడి కూడా రాక తనువులు చాలిస్తున్న అన్నదాతలు ఎంతోమంది. ఇక ఆర్ధిక కోరల్లో చిక్కుకున్న రైతులు బయట వ్యాపారుల దగ్గర, బ్యాంకుల్లో లోన్ తెచ్చుకోవడం పరిపాటే. అయితే ఈ లోన్ రావడానికి గ్రామీణ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో తెలిసిన విషయం. ఆ ప్రూఫ్స్ ఈ ప్రూఫ్స్ అంటూ బ్యాంక్ అధికారులు రైతుల చెప్పులు అరిగేలా తిప్పించుకుంటారు. చివరకు లోన్ సాంక్షన్ చేసినా ఆ డబ్బులు కట్టడానికి రైతులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒకానొక సందర్భంలో లోన్ కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా ఓ రైతు తీసుకున్న లోన్ కట్టలేదని బ్యాంక్ సిబ్బంది అతి చేశారు. ఆ రైతు ఇంటికొచ్చిన అధికారులు ఏకంగా ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
గూడూరు మండలం మదనాపురంకు చెందిన మాజీ సర్పంచ్ మోహన్ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పంట పెట్టుబడి రిత్యా 2021లో డీసీసీబీ బ్యాంకు నుండి లోన్ తెచ్చుకున్నాడు. ఆ మొత్తాన్ని కాస్త పంటకు పెట్టుబడిగా పెట్టాడు. కానీ పంట దిగుబడి రాకపోవడంతో నష్టం వాటిల్లింది. దీనితో తీసుకున్న రుణానికి సంబంధించి వాయిదాల ప్రకారం (EMI) చెల్లించాల్సి ఉంది. అయితే కొన్ని నెలలుగా రైతు మోహన్ EMI చెల్లించడం లేదు. దీనితో బ్యాంకు అధికారులు రైతుకు నోటీసులు ఇచ్చారు. అయితే పంట దిగుబడి రాక నష్టం వాటిల్లిందని మరింత గడువు కావాలని అధికారులకు తెలిపారు. దీనితో రైతు ఇంటికొచ్చిన బ్యాంకు సిబ్బంది రూల్స్ పేరుతో రెచ్చిపోయారు. అప్పు జప్తు పేరుతో ఏకంగా ఇంటి తలుపులు తీసుకెళ్లారు. ఆ రైతు కుటుంబసభ్యులు ఎంత మొరపెట్టుకున్నా కూడా సిబ్బంది పట్టించుకోలేదు. అంతేకాదు ఇంట్లో సామాగ్రిని సైతం వాహనంలో బ్యాంకుకు తరలించినట్లు తెలుస్తుంది. తీసుకున్న లోన్ వాయిదాలు చెల్లించి సామాగ్రి తీసుకెళ్లాలని రైతుకు బ్యాంకు సిబ్బంది చెప్పినట్లు సమాచారం.
కాగా బ్యాంకులో భారీగా లోన్ తీసుకున్న బడాబాబులను ఏమి చేయలేని బ్యాంకు అధికారులు..రైతులపై తమ పెత్తనం చేశారని స్థానికులు మండిపడుతున్నారు. లోన్ చెల్లించకుంటే ఏకంగా ఇంటి తలుపులు, సామాగ్రి ఎత్తుకెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank loan, Mahabubabad, Telangana