హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad: అట్టహాసంగా పెర్సపేన్ ఉత్సవాలు.. ఆకట్టుకున్న నృత్యాలు.. ముఖ్యంగా గిరిజనులు..

Adilabad: అట్టహాసంగా పెర్సపేన్ ఉత్సవాలు.. ఆకట్టుకున్న నృత్యాలు.. ముఖ్యంగా గిరిజనులు..

ఉత్సవాల్లో పాల్గొన్న గిరిజనులు

ఉత్సవాల్లో పాల్గొన్న గిరిజనులు

Telangana: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆది వాసీ గిరిజనులు తమ కుల దేవత పెర్సపేన్‌ (పెద్ద దేవుడు) కి సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పొలిమేరలోని చెట్టు వద్ద పూజల అనంతరం పెర్సపేన్‌ దేవతను గ్రామం చుట్టూ గిరిజనులు ఊరేగించారు. ఉత్సవాలపై స్టోరీ.

ఇంకా చదవండి ...

(కట్ట లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

ఆదిలాబాద్ జిల్లా అనగానే గుర్తుకువచ్చేది అడవులు. ఆ అడవులనే ఆటపట్టుగా చేసుకొని జీవిస్తున్న ఆదివాసి గిరిజనులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు అనాది నుండి వస్తున్న ఆచార, వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను నేటికి మరిచిపోకుండా వాటిని పాటిస్తున్నారు. వారు జరుపుకునే ప్రతి వేడుకలో, ఉత్సవాల్లో వారి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం జరుపుకునే పెర్సపేన్ పూజలను ఈసారి కూడా సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసి గిరిజన గూడాల్లో భక్తి శ్రద్దలతో గిరిజనులు పెర్సపేన్ పూజలు చేస్తున్నారు. కొన్నిగూడాల్లో ఉత్సవంగా, మరొకొన్నిగూడాల్ళో నిరాడంబరంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ప్రతి యేటా మే నెల చివరి వారంలో గిరిజనులు ఇలా పూజలు చేయడం ఆనవాయితీ.

వైశాఖ మాసాన్ని బావై మహిన అని పిలుచుకునే గిరిజనులు ఈ నెలాఖరులో కుల దేవత అయితే పెర్స పేన్ తోపాటు భీమల్ పేన్, జంగుబాయి దేవతలకు పూజలు చేస్తారు. ఇందులో భాగంగా గిరిజనులు తమ సంప్రదాయ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా దేవతలకు వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూరు మండలం ఖైర్ దాట్వా, ఇంద్రవెల్లి మండలంలోని చింతకర్ర, మల్కుగూడా గ్రామాలతోపాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి తదితర ఆదివాసి గిరిజన గూడాల్లో పెర్సపేన్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో పెన్ పటేల్ సిడాం జగన్నాథ్ రావ్, కటోడ సిడాం మారుతి ఆధ్వర్యంలో ఈ పెర్సపేన్ పూజలను నిరాడంబరంగా జరుపుకున్నారు. పూజల అనంతరం వెదురుబొంగులో పెర్సపేన్ ను భద్రపరిచి గ్రామ పొలిమేరలోని ఇప్పచెట్టుపై కట్టి భద్రపరిచారు.

ఈ పెర్సపేన్ ఉత్సవాల్లో భాగంగా ఆదివాసి మహిళలు, పురుషులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాడి పంటలు సమృద్దిగా పండటంతోపాటు తమ కుటుంబాలు, గ్రామంలో అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఈ పూజలు చేసినట్లు గిరిజన పెద్దలు పేర్కోన్నారు. తమ తాతల కాలం నుండి ఇలా పెర్సపేన్ కు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని, ఇందులో భాగంగానే ఈ యేడు కూడా ఈ పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నామని నార్నూరు మండలం ఖైర్ దాట్వా గ్రామానికి చెందిన ఆదివాసి యువకుడు మడావి మారుతి తెలిపారు.

First published:

Tags: Adilabad, Celebrations, Tribal huts

ఉత్తమ కథలు