హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఏజెన్సీలో ఏం జరుగుతుంది..? సర్వత్రా టెన్షన్ టెన్షన్..

Telangana: ఏజెన్సీలో ఏం జరుగుతుంది..? సర్వత్రా టెన్షన్ టెన్షన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత కొద్ది రోజులుగా తెలంగాణలో మావోయిస్టుల సంచారం ఎక్కువవుతున్నది. కొన్ని రోజులుగా వరుసగా సాగుతున్న ఎన్కౌంటర్లే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పలువురు మావోయిస్టు పెద్ద నాయకులు తెలంగాణలో తిష్ట వేశారని ప్రచారం కూడా జరుగుతున్నది. అసలు ఏజెన్సీలో ఏం జరుగుతున్నది..?

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

(జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 తెలుగు, ఖమ్మం)

తెలంగాణలోని ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అగ్రస్థానంలో ఉండే ఉమ్మడి ఖమ్మం ఏజెన్సీ ఒకటి. ఇక్కడ కొద్దిరోజులుగా రోజురోజుకూ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎక్కడికక్కడ ఎదురుకాల్పులు.. పోలీసు ఎన్‌‌కౌంటర్లు.. ప్రజాకోర్టు పేరిట హత్యలు నిత్యకృత్యంగా మారాయి. కేవలం రెండునెలల వ్యవధిలోనే ఉద్యమ ద్రోహులుగా చిత్రిస్తూ ప్రజాకోర్టులో విధిస్తున్న శిక్షలంటూ తీర్పులిస్తూ పాతికమంది సామాన్య ప్రజలను మావోయిస్టులు చంపడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెండు రోజుల క్రితం నాయకులపు ఈశ్వర్‌ అనే వ్యక్తిని పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు చంపేశారంటూ పోలీసు అధికారులు ఆరోపించారు. కాదు కాదు ఈ హత్యలకు బాధ్యత వహించాల్సింది పోలీసులు, ప్రభుత్వమేనంటూ మావోయిస్టులు బహిరంగలేఖ విడుదల చేశారు. ఇలా ఒక మరణం.. పలు వివాదాలకు దారితీసింది.

ఇప్పటికే కొద్ది వారాలుగా విరామం లేకుండా తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌, ఆంధ్ర, ఒడిషా బోర్డర్లలో విస్తృతంగా కూంబింగ్‌ ఆపరేషన్లు సాగుతునే ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్ల తనిఖీలు చేస్తూ, అనుమానం వచ్చిన వారిని విచారిస్తూ, అవసరమైతే అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో సామాన్య ప్రజలు సైతం ఈ పరిస్థితికి ఒణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో హత్యకు గురైన వ్యక్తి ఈశ్వర్‌ మావోయిస్టులకు చెందిన వాడంటూ పోలీసులు.. కాదు తమ ఉద్యమంలోకి పోలీసులు చొప్పించిన ద్రోహి ఈశ్వర్‌ అని మావోయిస్టులు ఆరోపణలకు దిగారు. మొత్తానికి వ్యూహప్రతివ్యూహాలతో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులు మైండ్‌గేమ్‌కు తెరతీశారు.

ఆ సినిమా మాదిరిగానే...:

పాతికేళ్ల క్రితం వచ్చిన 'ద్రోహి' సినిమా తరహాలోనే ఇప్పుడు పోలీసులకు, మావోయిస్టులకు మధ్యన పరస్పర వ్యూహాలు, ఎత్తుగడలు నడుస్తున్నాయి. తమకు నమ్మకస్తుడైన ఒక వ్యక్తిని తీవ్రవాద ఉద్యమంలోకి చొప్పించి, వారి నమ్మకం కుదిరాక టాప్‌క్యాడర్‌ ఆనుపానులు తెలుసుకుని తీవ్రవాద ఉద్యమాన్ని తుదముట్టించడం ఆ సినిమా స్టోరీ కాగా.. ఇక్కడ రెండు రోజుల క్రితం జరిగిన హత్య కూడా దాదాపు ఆ సినిమాలోని సీన్‌లను తలపిస్తున్నాయి. ''ఈశ్వర్‌ అనే వ్యక్తిని హోంగార్డ్‌గా అపాయింట్‌ చేసుకుని, ఆనక తమ ఆనుపానులు తెలుసుకోడానికి ఎస్‌ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో) తమ ఉద్యమంలోకి ప్రవేశపెట్టిందని, అతను కూడా తమను నమ్మించి అవసరమైన సామాన్లు తెస్తున్నట్టు నటించాడు.. ఉద్యమ నాయకత్వాన్ని తుదముట్టించడానికి అతను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, చాలాసార్లు అతను ఇచ్చిన సమాచారం మేరకు నమ్మి మోసపోయామని, చివరకు గత సెప్టెంబరు 7న శ్రీను, ఐతులను ఎన్‌కౌంటర్ల పేరిట చంపారని, ఆ మరణాలకు ఈశ్వర్‌ బాధ్యుడం’’టూ మంగళవారం నాడు విడుదల చేసిన బహిరంగలేఖలో మావోయిస్టు పార్టీ భద్రాద్రికొత్తగూడెం- తూర్పుగోదావరి జిల్లాల డివిజనల్‌ కమిటీ కార్యదర్శి అజాద్‌ ఆరోపించారు. దీంతోనే ప్రజాకోర్టులో విచారించి ఈశ్వర్‌ను శిక్షించామని పేర్కొన్నారు. ఈశ్వర్‌ను చనిపోయిందాకా కొట్టిన మావోయిస్టులు మృతదేహాన్ని చర్ల మండలం చెన్నపురం దగ్గరిలోని గొత్తికోయల గ్రామం గోరుగొండ వద్ద వదలి వెళ్లారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పోలీసుల సూచనలు :

మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని, ముఖ్యంగా వ్యాపారులు, ఆర్‌ఎంపీ వైద్యులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కూంబింగ్‌ ముమ్మరంగా జరుగుతున్న దృష్ట్యా చత్తీస్‌ఘడ్‌ అడవుల్లోకి ఎవరూ వెళ్లవద్దని, కూంబింగ్‌ సందర్భంలో ఎవరైనా పోలీసులకు దొరికితే మావోయిస్టులకు సహకరిస్తున్నట్టే భావిస్తామని స్పష్టం చేశారు. మావోయిస్టులు ప్రజలను వారి అవసరాలకు వినియోగించుకుంటూనే, అవసరం తీరాక చంపేస్తున్నారని, దీనికి ఈశ్వర్‌ ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలలోని పల్లెల నుంచి చత్తీస్‌ఘడ్‌ అడవుల్లోకి ఎవరూ వెళ్లొద్దని ప్రత్యేకంగా పేర్కొన్నారు. భయానికో, మరే కారణంతోనైనా మావోయిస్టులను నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీతదత్‌ హితవు పలికారు. ఇది సహజంగానే పరిస్థితి తీవ్రతను పెంచినట్లయింది.

ఇప్పటికే తెలంగాణలో పాగా వేయడానికి కొన్ని యాక్షన్‌టీంలు రంగంలోకి దిగాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు దండకారణ్యంలో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. డ్రోన్‌ కెమెరాలతో ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ మావోయిస్టుల కదలికలను తెలుసుకుంటూ వారి వ్యాప్తిని అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. దీనికోసం ఈ మధ్య కాలంలో కేంద్ర అంతర్గత భద్రతా ముఖ్య సలహాదారు కె.విజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసు బాస్‌ల సమావేశం భద్రాద్రి జిల్లాలోని వెంకటాపురంలో జరిగింది. అప్పటికే చాపకింద నీరులా విస్తరిస్తున్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా విధ్వంసాలు, హత్యాకాండలకు తెరతీశారు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది.

చత్తీస్‌ఘడ్‌లో ఏ చిన్న ఘటన చోటుచేసుకున్నా, తెలంగాణలో ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఒకవైపు మావోయిస్టు ఉద్యమంతో అభివృద్ది, సంక్షేమంలలో ఏరకంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందోనన్న వివరాలతో ప్రచారం ముమ్మరం చేస్తూ పోలీసు అధికారులు రకరకాల వ్యూహాలను అమలు చేస్తుండగా, మరోవైపు మావోయిస్టులు మాత్రం తమ ఉనికిని చాటుకోడానికి ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తునే ఉన్నారు. ఒకేరోజు రకరకాల గ్రూపులకు చెందిన 32 మంది నక్సల్స్‌ దంతెవాడ ఎస్పీ ఎదుట లొంగిపోగా, అదేరోజు ఆంధ్ర- ఒడిషా బోర్డరు పెదబయలు సమీపంలోని ఇంజరీ అటవీ ప్రాంతంలో పోలీసులు లక్ష్యంగా మందుపాతర పేల్చారు.

కొనసాగుతున్న కూంబింగ్ లు :

ఇంకా మంగళవారం రోజు సాయంత్రం దాకా అటు ఆంధ్ర- ఒడిషా బోర్డర్‌ మల్కనగిరి జిల్లా జుమడాంగ్‌ అటవీ ప్రాంతంలోనూ, చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలోనూ పోలీసు బలగాలకు, మావోయిస్టులకు పరస్పర ఎదురుకాల్పులు చోటుచేసుకుంటునే ఉన్నాయి. ఈ పరిణామాలు ఇటు తెలంగాణ, చత్తీస్‌ఘడ్‌, ఆంధ్ర, ఒడిషాలలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితి తయారైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న బెంగతో గడుపుతున్నారు.

First published:

Tags: Khammam, Maoists, Telangana, Telangana News, Telangana Police

ఉత్తమ కథలు