(జి.శ్రీనివాస్ రెడ్డి న్యూస్ 18 తెలుగు, ఖమ్మం)
తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దులో మావోయిస్టులు (Maoists) మరోసారి చెలరేగిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. మరో ఇద్దరు యువకులను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనతో రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో మరోసారి భయానకమైన వాతావరణం నెలకొంది. ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల మధ్య.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డీజీపీ ఈ ప్రాంతంలో పర్యటించిన ప్రతి సందర్భంలోనూ మావోయిస్టులు తమ ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ఒక హింసాత్మక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బాడీ బసంత్ అనే వ్యక్తిని తమ సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నాడన్న నెపంతో దారుణంగా చంపేశారు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు యువకులను తమ అదుపులోకి తీసుకొని తమ వెంట తీసుకెళ్లారు.
వాస్తవానికి ఇటీవలే ఈ ప్రాంతంలో డిజిపి మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తానని చెప్పారు. జరిగిన ఘటన కాకతాళీయం అయినప్పటికీ, సాక్షాత్తు డిజిపి పర్యటన అనంతరం చోటు చేసుకోవడంతో మావోయిస్టులు ఎంతకైనా తెగబడతారన్న సందేశం వెళ్ళిపోయింది. గతంలోనూ డీజీపీ పర్యటించిన సందర్భంలో ఇదే తరహా దాడులకు తెగబడిన ఉదాహరణలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం అంటే 2020 అక్టోబర్ 4వ తేదీన ఏజెన్సీలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. ఆయన పర్యటన ముగిసిన వారం తర్వాత వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన మాధురి భీమేశ్వరరావు అనే వ్యాపారిని మావోయిస్టులు హతమార్చారు. అప్పట్లో అదో సంచలనం రేకెత్తించింది. ఇలా పోలీసు ఉన్నతాధికారులు పర్యటించిన ప్రతి సందర్భంలోనూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ.. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రూపొందిన అనంతరం అప్పటిదాకా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రంగా ఉన్న ప్రాంతాన్ని, మావోయిస్టు ఫ్రీగా మార్చాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా , ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర హోం శాఖ సలహాదారు కె విజయకుమార్, సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు పలుమార్లు సరిహద్దుల్లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో సమావేశం అయ్యారు. మావోయిస్టులను తుదముట్టించడానికి పటిష్టమైన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సంయుక్త బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా సమయం ఆదా ఆదావుతుందని, పటిష్టంగా మావోయిస్టులను నివారించవచ్చని అంచనా వేశారు. అయితే గత రెండేళ్లలో తమకు పట్టున్న ప్రాంతంలోకి పోలీసు అధికారులు చేరుకున్న ప్రతి సందర్భంలోనూ.. మావోయిస్టులు విధ్వంసానికి, కిడ్నాప్లకు పాల్పడ్డారు. తాజాగా ఘటనతో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, Khammam, Maoists, Telangana