జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సమీపంలోని దోరగూడ అడవుల్లో ఈ ఉదయం చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ మృతిచెందారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే మృతుల గుర్తింపు, క్యాడర్లో వారి స్థాయి, రివార్డు ఎంత అన్నది వెలుగుచూడనుంది. అయితే మృతిచెందిన వారిలో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు ఉన్నట్టు చెబుతున్నారు. ఎదురుకాల్పుల్లో చనిపోయిన వారిలో మధు ఉన్నట్లయితే, మావోయిస్టులకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన చర్ల ప్రాంతంలో ఇక కార్యకలాపాలకు తెరపడినట్టేనని చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పటిదాకా ఈ రాష్ట్ర భూభాగంలో ఇంత దాకా ఎన్కౌంటర్లు, ఎదురుకాల్పులు జరిగిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు.
కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చే సమాచారం ఆధారంగా సంయుక్త బలగాలు ఉమ్మడిగా చత్తీస్‌ఘడ్‌లో ఆపరేషన్లు నిర్వహించడమే ఇన్నాళ్లూ జరుగుతోంది. కానీ ఈసారి తెలంగాణ సరిహద్దులకు సమీపంలో కూంబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్ టీంపై లోకల్ మిలీషియా దళం కాల్పులకు తెగబడడం ఆశ్చర్యకరమన్నది విశ్లేషకుల మాట. తమకు ఉద్దేశించిన విధులకు భిన్నంగా మిలీషియా వ్యవహరించడం వెనుక ఏం జరుగుతోందో అన్న చర్చ సర్వత్రా నెలకొంది.
సోమవారం తెల్లవారుజామున. భద్రాద్రి కొత్తూగూడెం జిల్లా చర్ల మండలంలోని చిన్నచందా అటవీ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ బలగాలు సహా స్థానిక పోలీసులు, ఐటీబీపీ పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. కూంబింగ్ బృందంపై ఒక్కసారిగా స్థానిక మిలీషియా సభ్యులు కాల్పులకు తెగబడ్డారు. సాధారణంగా మావోయిస్టు టాప్ క్యాడర్‌కు, యాక్షన్ టీంలకు సహాయ సహకారాలు అందించడానికి ఉద్దేశించిన మిలీషియా బృందాల చేతుల్లో ఆధునిక ఆయుధాలు ఉండడం పోలీసులను సైత నివ్వెరపోయేలా చేసింది. తేరుకుని తూటాలు వచ్చిన దిశగా కూంబింగ్ చేస్తూ కాల్పులకు దిగడంతో కొన్ని గంటలపాటు పరస్పర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఘటనలో నలుగురు మహిళలు సహా ఆరుగురు నక్సల్స్ మృతిచెందారు. ఎదురు కాల్పులు జరిగిన ఘటన సరిగ్గా ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంది.. ఎవరి భౌగోళిక పరిధిలో ఉందన్నది ఇతమిద్ధంగా తెలియరాలేదు. సుక్మా జిల్లాలోని కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలో పెసర్లపాడు దగ్గరలోని దోరగూడ అడవుల్లో ఘటన జరిగిట్టుగా అంచనా వేస్తున్నారు. బీజపూర్ జిల్లాకు సమీపంలో కూడా కావచ్చన్నది అంచనా. స్పష్టమైన భౌగోళిక సరిహద్దులు అంచనా వేయడం కష్టమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి అతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మాత్రం సర్వత్రా చర్చనీయాంశమైంది. మావోయిస్టుల ఉనికి కూడా లేని తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌తో కొత్త ఆలోచనలు ముప్పిరిగొంటున్నాయి.
సాధారణంగా స్థానిక గిరిజనంపై పట్టు సంపాదించడానికి, తమ పిలుపును శిరసా వహించడానికి, టాప్ క్యాడర్లోని నేతలకు అవసరమైనప్పుడు షెల్టర్ ఇవ్వడం, చెట్లను నరికి రహదారులను దిగ్బంధించడం, కరపత్రాలను అంటించడం లాంటి వాటికే పరిమితమైన క్షేత్ర స్థాయి మిలీషియా కొత్తగా ఆయుధం పట్టడం, అదీనూ ఆధునిక ఆయుధాలు ఉపయోగించడం వెనుక ఏ వ్యూహం దాగుందన్న చర్చ నడుస్తోంది. మెయిన్ స్ట్రీం మావోయిస్టు ఉద్యమకారులకు స్టాఫ్ ఏజెన్సీలా పనిచేసే మిలీషియా నేరుగా రంగంలోకి దిగడం వెనుక ఉన్న కారణాలను అంచనా వేస్తున్నారు.
మావోయిస్టులు అనుకున్న దానికన్నా ఎక్కువగా బలహీన పడి, మిలీషియాను సైతం రంగంలోకి దింపేంతగా పరిస్థితి విషమించిందా..? లేక మిలీషియాను సైతం యుద్ధ తంత్రానికి పంపేంతగా మావోయిస్టులు సిద్ధం చేశారా అన్నది తేలాల్సి ఉంది. మావోయిస్టు ఉద్యమానికి ప్రధాన అంగాలలో ఒకటైన మిలీషియా ఆధునిక ఆయుధాలు వాడుతున్నారు అంటే..? ఎక్కడ శిక్షణ పొందారు..? ఎంత మంది ఇలాంటి శిక్షణ తీసుకున్నారు..? అందరూనా..? లేక ఎంపిక చేసిన క్యాడర్ మాత్రమే శిక్షణ పొందిందా..? అన్న కోణంలో అంచనాలు సాగుతున్నాయి.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.