ప్రముఖ సన్యాసి, శ్రీవైష్ణవాన్ని ప్రబోధించే ఆథ్యాత్మిక గురువు, రామానుజ సమతామూర్తి క్షేత్ర రూపకర్త త్రిదండి చినజీయర్ స్వామి మరోసారి అనూహ్య వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల కిందట.. గిరిజన వనదేవతలైన సమ్మక్క-సారక్కను కించపర్చేలా కామెంట్లు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న చినజీయర్ ఇప్పుడు ఏకంగా కేసీఆర్ సర్కారునే టార్గెట్ చేసినట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన దేవాదాయ శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. అదే సమయంలో ఆలయాల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలన్నారు. సీఎం కేసీఆర్, చినజీయర్ మధ్య విభేదాలు తీవ్రతరమై మాట్లాడుకోవడమే మానేశారన్న వార్తల నడుమ స్వామీజీ కామెంట్లకు ప్రాధాన్యం ఏర్పడింది. వివరాలివే..
హిందూ ఆలయాలు ప్రభుత్వాల నిర్వహణలో కంటే భక్తుల చేతుల్లో ఉంటేనే మెరుగైన అభివృద్ది ఉంటుందని, భక్తుల నిర్వహణలోని ఆలయాలతో పోల్చినప్పుడు దేవాదాయ శాక ఆధ్వర్యంలోని గుడుల్లో వైభవాలేవీ కనిపించవని చినజీయర్ స్వామి అన్నారు. ఆలయాల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకొని, భక్తులకే అప్పగిస్తే అదెంతో శ్రేయస్కరమని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు హాజరైన చినజీయర్ ఈ మేరకు కేసీఆర్ సర్కారు శాఖకు పరోక్షంగా చురకలు వేశారు.
జగిత్యాలలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని స్థానిక భక్తులే నిర్వహిస్తుంటారని, వారి ఆధ్వర్యంలో ఆలయం దినదినాభివృద్ది చెందుతున్నదని, అదే దేవాదాయ శాఖ చేతుల్లోకి ఆలయాలు వెళితే వైభవాలు ఉండవని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. ఒక ఆలయంలో గోడలు, తలుపులు, తాళాలు, ప్రాకారాలు కంటే కూడా మగళశాసనాలే ప్రధానమని, అలాంటి మంగళశాసనలు ఇచ్చేది ఆళ్వారులని జీయర్ గుర్తుచేశారు. భక్తులు ఏ శ్రద్దతోనైతే భగవంతుడికి సేవలు చేసుకుంటారో, ఆ భక్తులను ప్రోత్సహించేలాగానే ఆలయాలను ఉంచడం శ్రేయస్కరమన్నారు.
చినజీయర్ వ్యాఖ్యలు హిందూ సమాజానికి కీలక సూచనలా ఉన్నాయని, అదే సమయంలో సీఎం కేసీఆర్ తో విభేదాల నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేసినట్లుకూడా ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. భక్తుల ఆధ్వర్యంలోనే ఆలయాలు బాగుంటాయని, దేవాదాయ శాఖ సరిగా నిర్వహించదని బాహాటంగానే విమర్శించిన జీయర్ వ్యాఖ్యలపై ఆ శాఖ స్పందించాల్సిఉంది. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న దాదాపు 20వేల ఆలయాల బాధ్యతను వంశపారంపర్య పూజారులు, అనువంశిక ధర్మకర్తలకే వదిలిపెట్టాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో చినజీయర్ వ్యాఖ్యలకు విస్తృత అర్థం ఉందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఆథ్యాత్మికత, సంబంధిత విషయాల్లో ఒకప్పుడు సీఎం కేసీఆర్ ను పొగిడిన చినజీయర్ ఇప్పుడు దేవాదాయ శాఖపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆంధ్రా ప్రాంతానికి చెందిన చినజీయర్ స్వామితో దగ్గరి సంబంధాలు కొనసాగిస్తుండటం, వైదిక విషయాల్లో దాదాపు సలహాదారుగానూ భావించి హెలికాప్టర్లలో అధికారిక పర్యటనలు చేయడం, ప్రతిష్టాత్మక యాదగిరిగుట్టను యాదాద్రిగా రీడిజైన్ చేయడంలో సాయం తీసుకోవడం తదితర పరిణామాలు తెలిసిందే. కాగా, ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పరస్పర విమర్శలు, పలు అంశాల్లో కేంద్రంతో కేసీఆర్ పోరు ఉధృతంగా సాగిన సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్న సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంలో కేసీఆర్, చినజీయర్ మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి.
సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్న యాదాద్రి పున:ప్రతిష్ట కార్యక్రమానికి రూపకర్త అయిన చినజీయర్ ను ప్రత్యేకంగా పిలవకపోవడం, జీయర్ పెట్టిన యాదాద్రి అనే పేరుకు బదులు మళ్లీ యాదగిరిగుట్టగా వ్యవహరిస్తుండటం లాంటి పరిణామాలు విభేదాలు నిజమేననే అనుమానాలకు తావిచ్చినట్లయింది. వనదేవతలు సనాతన దైవాలు కాదు, ఎక్కడినుంచో వచ్చారన్న చినజీయర్ ఇప్పుడు దేవాదాయ శాఖతో దేవాలయాలు బాగుపడంటూ మరో బాంబు పేల్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chinna Jeeyar Swamy, CM KCR, Hindu Temples, Jagityal