US President Joe Biden: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బిడెన్... తనకంటూ ప్రత్యేక టీమ్‌ని దశలవారీగా ప్రకటించారు. తాజాగా ప్రకటించిన టీమ్‌లో 20 మంది భారతీయ-అమెరికన్లు ఉన్నారు. వారిలో 13 మంది మహిళలే ఉన్నారు. ఐతే... ఆ 20 మందిలో ఓ తెలుగు రత్నం కూడా ఉండటం మన తెలుగు వారికి గర్వకారణం. ఆయన ఎవరో కాదు చొల్లేటి వినయ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. వైట్‌హౌస్‌లో తనకు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా వినయ్‌రెడ్డిని మొన్ననే జో బిడెన్ నామినేట్ చేశారు. అందువల్ల వినయ్ రెడ్డి ఒకట్రెండు రోజుల్లో ఈ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. వినయ్ రెడ్డి తల్లిదండ్రులు చొల్లేటి నారాయణరెడ్డి, విజయారెడ్డి.... కరీంనగర్ జిల్లా... హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన వారు కావడంతో... ఇప్పుడా గ్రామస్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వినయ్ రెడ్డి పేరెంట్స్ 1970లో అమెరికా వెళ్లారు. నారాయణరెడ్డి అక్కడే డాక్టర్‌గా స్థిరపడగా, ఆయన ముగ్గురు కొడుకుల్లో ఒకరైన వినయ్‌రెడ్డికి ఇప్పుడు అరుదైన గుర్తింపు లభించింది. అమెరికాలోని ఒహియో రాష్ట్రం డేటన్లో పుట్టి పెరిగిన వినయ్‌రెడ్డి కిండర్ గార్డెన్ నుంచి డిగ్రీ వరకు ఒహియాలోనే చదువుకున్నారు. మియామి యూనివర్శిటీ నుంచి లా పట్టా పొందారు.

వైట్‌హౌస్‌లో తెలుగు రత్నం... వినయ్‌రెడ్డికి అరుదైన గుర్తింపు (image courtesy - twitter)
వినయ్‌రెడ్డి... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్, కమలా హ్యారిస్ ఎన్నికల ప్రచారానికి సీనియర్ సలహాదారుగా, ప్రసంగ రచయితగా పనిచేశారు. వారు ఏ రాష్ట్రంలో ప్రసంగాలకు వెళ్లినా వినయ్ రెడ్డే స్పీచ్ ప్రిపేర్ చేసేవారు. దాంతో ఈసారి వారి ప్రసంగాల్లో తెలుగు వాడి సత్తా కనిపించింది. ముఖ్యంగా కమలా హారిస్ కూడా లాయర్ కావడంతో... వినయ్ రెడ్డి ప్రిపేర్ చేసిన స్పీచ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. ఫలితంగా అమెరికన్లు ఈసారి జో బిడెన్, కమలా హారిస్ టీమ్‌కి పట్టం కట్టారు.
ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారికి గజిబిజి, కోపం ఎక్కువ... మీ రాశి ఏది?
వినయ్‌రెడ్డి తాతగారు తిరుపతిరెడ్డి. పోతిరెడ్డిపేట గ్రామంలో 30 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. వినయ్‌రెడ్డి తండ్రి నారాయణరెడ్డి అమెరికా వెళ్లి డాక్టర్‌గా స్థిరపడ్డారు. పోతిరెడ్డిపేటలో వారికి సొంత ఇల్లు, ఐదెకరాల పొలం ఉన్నాయి. నారాయణరెడ్డితోపాటు కుటుంబసభ్యులు సొంత గ్రామమైన పోతిరెడ్డిపేటకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. అందువల్ల ఆ కుటుంబం పట్ల గ్రామస్థులు ఎంతో అభిమానం చూపిస్తున్నారు. ఇలా పోతిరెడ్డిపేట నుంచి అమెరికాలోని వైట్‌హౌస్‌కి సాగిన ప్రయాణం అందరిలో చైతన్యం కలిగిస్తోంది.
Published by:Krishna Kumar N
First published:January 20, 2021, 11:44 IST