TELANGANA TO ROLL OUT HOME TO HOME FEVER SURVEY FROM TODAY HEALTH STAFF WILL SUPPLY COVID ISOLATION KITS SK
Telangana: నేటి నుంచి ఇంటింటి జ్వర సర్వే.. పరీక్షలు చేసి అక్కడికక్కడే మందులు
ప్రతీకాత్మక చిత్రం
Telangana Fever Survey: నేటి నుంచి వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ తిరుగుతారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర
లక్షణాలున్న వారికి ఎక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లు ఇస్తారు. ఇందుకోసం ఇప్పటికే కోటి ఔషధ కిట్లను అన్ని ఆసుపత్రులకు పంపించారు.
దేశవ్యాప్తంగా కరోనా మూడో దశ (Corona Third Wave) విరుచుకుపడుతోంది. కొత్త లక్షల్లో నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వ్యాప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే (Home to Home fever survey) నిర్వహించాలని నిర్ణయిచింది. ఇవాళ్టి నుంచే ఈ కార్యక్రమం ప్రారంం కానుంది. గతంలో రెండోదశ ఉద్ధృతి సమయంలో కూడా జ్వర సర్వే నిర్వహించారు. ఆ అనుభవం ఉండడంతో ఈసారి కూడా వేగంగా జర్వ సర్వేను నిర్వహించాలని వైద్య సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ తిరుగుతారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర లక్షణాలున్న వారికి ఎక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లు (Home isolation kits) ఇస్తారు. ఇందుకోసం ఇప్పటికే కోటి ఔషధ కిట్లను అన్ని ఆసుపత్రులకు పంపించారు.
ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండే వారిని వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. ఆరోగ్య సమాచారం గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఒకవేళ ఎవరిలోనైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ తాజా పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఇంటింటి జర్వ సర్వే గురించి అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. పరీక్షలను వేగవంతం చేసి.. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచడమో లేదంటే ఆస్పత్రిలో చేర్పించడమో చేయాలని సూచించారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఇంటింటి జ్వర సర్వే చేశారు. స్వల్ప లక్షణాలున్న వారికి హోమో ఐసోలేషన్ కిట్లను సరఫరా చేశారు. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ జ్వర సర్వేను నీతి ఆయోగ్, ఎకనామిక్ సర్వే రిపోర్టు కూడా ప్రశంసించాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ సమయంలోనూ అదే స్ఫూర్తితో మరోసారి జ్వర సర్వేను నిర్వహిస్తామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైద్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. జ్వర సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి.. ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు. అవసరమైన వారికి హోం ఐసోలేషన్ కిట్లు ఇచ్చి..మందులు ఎలా వేసుకోవాలో సూచించే కరపత్రాన్ని అందజేస్తారు.
ఇంటింటి జ్వర సర్వేలో స్థానిక ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. వారంతా కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. జ్వర సర్వేలో భాగస్వామ్యమవుతారు. ఇక కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆదివారం కూడా బస్తీ దవాఖానాలను తెరుస్తారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ వైద్య సేవలు అందుతాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం ఆస్పత్రులో మొత్తం 27 వేల బెడ్స్‌కు ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించారు. 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా పరీక్షలను ఉచితంగానే చేస్తుండగా.. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధరలు రూ.500కు మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా నిబంధలను ఉల్లంఘించి అధిక ధరలు వసూలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.