తెలంగాణలో చాలాకాలం తరువాత నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు తెరుచుకోనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, ఇతర రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు తెరవడంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ పిల్లలను స్కూళ్లకు పంపడం, పంపించకపోవడం అనేది తల్లిదండ్రుల ఇష్టమని స్పష్టం చేసింది. ఎలాంటి భయం లేకుంటేనే విద్యార్థుల్ని పాఠశాలలకు పంపాలని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలలు మినహా అన్ని విద్యాసంస్థలను నేటి నుంచి ప్రారంభించాలని ఆదేశించింది. విద్యాబోధన ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్ల ప్రారంభాన్నీ హైకోర్టు నిలిపేసింది.
మరోవైపు రాష్ట్రంలో పాఠశాలల విద్యార్థులు సుమారు 60 లక్షల మంది వరకు ఉంటారన్నది ఓ అంచనా. వీరిలో 29 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. 1,200 గురుకుల పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులుండగా, మొత్తం 1,700 సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ 2 లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఈ రెండింటినీ ప్రారంభించడానికి అనుమతించలేదు. దీంతో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు వెళ్లే అవకాశం లేదు. గురుకుల విద్యార్థులు కొంతకాలం దూరదర్శన్, టీశాట్ ద్వారా జరిగే ఆన్లైన్ తరగతులపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటికి అనుమతి ఇవ్వడంతో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యలు ఎటువైపు ఎక్కువగా మొగ్గుచూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు పద్ధతుల్లో విద్యాబోధన కొనసాగించాలని భావిస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు.. ముందుగా పాఠశాలలకు ఎంతమంది విద్యార్థులు వస్తారనే దానిపై దృష్టి పెట్టింది. వారం, పది రోజుల తరువాత ఈ అంశంపై ఓ అంచనాకు రావొచ్చని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు భావిస్తున్నాయి.
మరోవైపు ధర్డ్వేవ్ భయం ఉండటం వల్ల కొంతకాలం వేచి చూసిన తర్వాతే ప్రత్యక్ష బోధనకు పిల్లలను పంపుతామని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికప్పుడు చిన్న తరగతుల నిర్వహణ కష్టమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలు తెరుస్తున్నప్పటికీ.. విద్యార్థుల హాజరు తప్పనిసరికాదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని ప్రైవేటు స్కూళ్ళకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.