11 ఏళ్ల తర్వాత తెరచుకున్న గేట్లు... సరళ సాగర్‌కు జలకళ... వీడియో

11 ఏళ్ల తర్వాత తెరచుకున్న గేట్లు... సరళ సాగర్‌కు జలకళ... వీడియో

తెలంగాణలో వర్షాలు ఎంత ఎక్కువగా కురుస్తున్నాయో చెప్పేందుకు సరళ సాగర్ ప్రాజెక్టే ఓ ఉదాహరణ. అసలు ఆ ప్రాజెక్టు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

 • Share this:
  తెలంగాణ... వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు తాజా వర్షాలతో పూర్తిగా నిండిపోయింది. సరళా సాగర్‌ చాలా ప్రత్యేకమైనది. ఇందులో ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టమ్‌ ఉంది. అంటే ప్రాజెక్టులో నీరు నిండగానే... మనుషుల ప్రమేయం (ఆపరేటర్‌) లేకుండానే గాలి ఒత్తిడితో సైఫన్‌లు తెరుచుకొని నీటిని కిందకు వదిలేస్తాయి. ఆసియా ఖండంలో ఇలాంటి టెక్నాలజీ ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీ ఉన్న రెండో ప్రాజెక్టు ఇదే. ఎంత గొప్ప విషయం ఇది. తెలంగాణ ప్రజలకు ఈ ప్రాజెక్టు గర్వకారణం. ఈ ప్రాజెక్టులో నాలుగు ప్రైమరీ సైఫన్లు, 17 ఉడ్‌ సైఫన్లు ఉన్నాయి. పూర్తిగా నీరు నిండగానే ప్రైమరీ సైఫన్‌లు తెరచుకుంటాయి. ఇంకా ఇన్‌ఫ్లో ఎక్కువగానే కొనసాగుతుంటే ఉడ్‌ సైఫన్ల ద్వారా నీరు కిందకు ప్రవహిస్తుంది.

  మదనాపురం మండల పరిధిలోని ఊకశెట్టు వాగుపై 1947లో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళమ్మ పేరు మీద సరళాసాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. దీనిని 1949లో ప్రారంభించారు. అర టీఎంసీ నీటి సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు కింద సుమారు 4,500 ఎకరాలకు సాగు నీరందుతోంది.

  ఒక్క ప్రైమరీ సైఫన్‌ 500 క్యూసెక్కులు, ఒక్క ఉడ్‌ సైఫన్‌ 2450 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తాయి. చివరి సారిగా 2009 సంవత్సరం సెప్టెంబర్‌లో సైఫన్‌ల ద్వారా నీరు విడుదలైంది. ఆ తర్వాత అలా జరగలేదు. ఇప్పుడు మళ్లీ నీరు విడుదలవుతోంది. సరళాసాగర్‌కు పూర్తి స్థాయిలో నీరు వస్తోంది కాబట్టి పర్యాటకులు, పరిసర ప్రాంతాల రైతులు, పశువుల కాపర్లు వాగులోకి వెళ్లొద్దని అధికారులు కోరారు. 1983లో వనపర్తి డిగ్రీ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు ప్రాజెక్టు కింద ఫొటోలు దిగుతుండగా సైఫన్‌లు ఓపెన్‌ కావడంతో నీటిలో కొట్టుకుపోయారు.

  11 ఏళ్ల తర్వాత సరళ సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడం సంతోషంగా ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయమే ప్రాజెక్టును సందర్శించిన ఆయన... సంతోషం వ్యక్తంచేశారు.
  Published by:Krishna Kumar N
  First published: