నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీకి (Telangana RTC) ఎండీగా నియామకం అయినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ (V.C Sajjanar IPS) తన మార్క్ నిర్ణయాలతో సంస్థలో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల (TSRTC Passengers) నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంకా ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బస్టాండ్ లలో (Bus Stations) వివిధ సేవలకు డబ్బులను యూపీఐ (UPI), క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా చెల్లింపు సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (MGBS)లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్‌పాస్ కౌంటర్లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలను ప్రారంభించిన సమయంలో ఆర్టీసీ ఎండీ ప్రయాణికులు ఈ సర్వీసులపై తమ అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని సజ్జనార్ (V.C Sajjanar IPS) గతంలో కోరారు.
చేతిలో డబ్బులు లేకపోతే ఎలా..?
ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ చిల్లర కష్టాలు కామన్. చాలామంది చేతిలో డబ్బులు తెచ్చుకోరు, పర్సులో సమయానికి డబ్బులు కూడా ఉండవు. ఆ సమయంలో అర్జెంట్‌గా బస్సులో ప్రయాణించాల్సి రావొచ్చు. అయితే డబ్బులు లేకపోతే బస్సులో కండక్టర్ మనల్ని ఎక్కనివ్వడు. ఈ నేపథ్యంలో బస్సుల్లో ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు గాను టికెట్ తీసుకునే సమయంలో నగదు రహిత లావాదేవీ విధానాన్నిఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా..
తెలంగాణలోని ప్రతి ఆర్టీసీ బస్సులో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్ ను కొనుగోలు చేసే విధానాన్ని త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
నగదు రహిత, లావాదేవీల్లో భాగంగా ఆర్టీసీ (RTC) ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న బస్‌పాస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా చిల్లర కష్టాలకు చెక్ పెట్టడం సహా వినియోగదారులకు శ్రమ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, సజ్జనార్ సోషల్ మీడియాలో కూడా సమస్యలకు స్పందిస్తుంటారు. ఓ జర్నలిస్టు.. ఆర్టీసీ బస్సులపై అంటించే ఆశ్లీల పోస్టర్ల విషయాన్ని సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లగా.. నెటిజన్ ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బస్సులపై ఇలాంటి పోస్టర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చర్యలు తీసుకుంటానని సజ్జనార్ ప్రకటించారు. ఇచ్చిన ప్రకటన మేరకు ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల ఫోటోలను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus services, Buses, Digital payments, Sajjanar, Ticket, Tsrtc