తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం ఇక లేరు. (Mallu Swarajyam passed away) 91 ఏళ్ల స్వరాజ్యం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయంత్రం ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం, పార్టీ వర్గాలు, కుటుంబీకులు ప్రకటనలు చేశారు. యోధురాలి మృతిపట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాలు తెలుపుతున్నారు.
మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఎం పార్టీ సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. 16 ఏళ్ల చిన్న వయసులోనే మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధ పోరాటలో తుపాకీ పట్టిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు..
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నిజాం దళాలు తగులబెట్టాయి. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు.
నాడు దొరల దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మల్లు స్వరాజ్యం తన పాటలతోనూ ప్రజల్ని చైనత్యపర్చారు. మహిళా కమాండర్‌గా పని చేశారు. అప్పటి నిజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.
మల్లు స్వరాజ్యం ఉమ్మడి ఏపీలో నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుంచి 83 వరకు మొదటి దఫా, 1983 నుంచి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలోనూ మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు.
మల్లు స్వరాజ్యానికి కూతురు పాదూరి కరుణ, కుమారులు మల్లు గౌతమ్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి ఉన్నారు. ఆమె చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సీపీఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా, చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.