బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో పాటు ఇతర రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద ప్రవహించడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోతున్నాయి. మనుషులు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో వరద ప్రవాహంలో మేకలు కొట్టుకుపోయాయి. వాగు దాటుతుండగా యజమాని ముందే ప్రవాహంలో పడి కొట్టుకుపోయాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడిగూడలోని సిడాం శంభు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్ట్ దిగువన వరద ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో శంభు మత్తడిగూడ నుండి సుంగు మత్తడిగూడకు వెళ్లె దారిలో వాగు ఉధృతి పెరిగింది. అదే సమయంలో రైతు పంద్ర జుగాదిరావ్ తన 20 మేకలను అవతలి ఒడ్డుకు దాటించే ప్రయత్నం చేశాడు. వాగు దాటుతుండగా వరద ఉధృతికి 10 మేకలు కొట్టుకుపోయాయి. గ్రామస్తులు హుటాహుటిన వాగు దిగువకు వెళ్లి మేకలను కాపాడారు. గ్రామస్తుల సహకారంతో అదృష్టవశాత్తు తన మేకలు దొరికాయని పంద్ర జుగాది రావ్ తెలిపారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కాగా, ఉత్తర కోస్తా, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని గాంగ్ టక్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్ట్ 19 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో నిన్న ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా కురిశాయి. నేడు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.