స్పీకర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... సీఎల్పీ విలీనమే తరువాయి

Telangana Politics : పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దుమ్మురేపడంతో... ఇక కాంగ్రెస్‌ను ఆ పార్టీలో కలిపేసుకునే అంశంపై కారు పార్టీ దృష్టి సారిస్తోంది. చకచకా పావులు కదుపుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 6, 2019, 2:07 PM IST
స్పీకర్‌ను కలిసిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... సీఎల్పీ విలీనమే తరువాయి
కాంగ్రెస్, టీఆర్ఎస్
  • Share this:
2018 అసెంబ్లీ ఎన్నికల్లో... గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది అధికార టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. లోక్ సభ ఎన్నికలకు ముందు నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వివిధ సందర్భాల్లో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి సముఖత వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వారందరితో ఇవాళ కేటీఆర్... ప్రగతిభవన్‌లో విందు సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉండటంతో... కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని (CLP) కూడా టీఆర్ఎస్ శాసన సభా పక్షం (TRSLP)లో విలీనం చేసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది.

మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్‌లో చేరితే, వాళ్లంతా పార్టీ పిరాయింపులకు పాల్పడినట్లవుతుంది. అలా కాకుండా... మొత్తం శాసన సభా పక్షాన్నే టీఆర్ఎస్‌లో విలీనం చేసేసుకుంటే... ఇక ఏ సమస్యలూ ఉండవని పాలక పక్షం భావిస్తోంది. ఆ విలీన ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఈ విందు సమావేశం ఏర్పాటు చేశారని తెలిసింది. సమావేశం తర్వాత... 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. పార్టీ సీఎల్పీ విలీనానికి సంబంధించిన లేఖను స్పీకర్‌కి ఇచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్‌కి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబీ కండువా కప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తెలుస్తోంది.

First published: June 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు