Home /News /telangana /

TELANGANA POLITICS ALL PARTIES FOCUSED ON THIS KEY ASSEMBLY CONSTITUENCY NS

Telangana Politics: ఆ నియోజకవర్గంపై అన్ని పార్టీల కన్ను.. ఉద్యమ నేత చేరిక బీజేపీకి కలిసి వస్తుందా?

తెలంగాణ మ్యాప్

తెలంగాణ మ్యాప్

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో చేరికలపై దృష్టి సారించాయి.

  తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య నేతల పర్యటనలు, నేతల హాట్ హాట్ కామెంట్లను పరిశీలిస్తే ఎన్నికలు వచ్చేశాయా? అన్నట్లు అనిపిస్తోంది. ఎలాగైనా.. మరో సారి తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని అధికార టీఆర్ఎస్ నేతలు సర్వశక్తులు ఒడ్డుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం సీఎం పీఠం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఇంకా హీటెక్కింది. అందులో ఒకటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం. ఈ స్థానాన్ని మరో సారి తమ ఖాతాలో వేసుకోవాలని కారు పార్టీ నేతలు స్కెచ్ లు వేస్తుంటే.. ఇక్కడ తమ జెండా ఎగురవేయాలని బీజేపీ, కాంగ్రెస్ నుంచి మొదలుకుని బీఎస్సీ, వైఎస్సార్టీపీలు సైతం పావులు కదుపుతున్నాయి. ఈ నియోజకవర్గం గతంలో జనరల్ కాగా.. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంలో 2009లో ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. అనంతరం టీడీపీ నుంచి మోత్కుపల్లి నర్సింహులు ఓ సారి గెలుపొందగా.. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి విద్యార్థి ఉద్యమ నేత గాదరి కిశోర్ రెండు పర్యాయాలు విజయం సాధించారు.

  ఆ రెండు సార్లు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ కిశోర్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే.. ఈ సారి ఎలాగైనా విజయం అందుకోవాలని అద్దంకి దయాకర్ ఆశపడుతున్నారు. అయితే.. కాంగ్రెస్ లోని వర్గ విభేదాలు ఆయనకు అడ్డంకి గా మారాయి. ఇంకా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారధ్యంలోని బీఎస్పీ సైతం ఇక్కడ విజయం సాధించాలన్న లక్ష్యంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. దీంతో బీఎస్పీ శ్రేణులతో పాటు, స్వేరో సభ్యులు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ షర్మిల సారథ్యంలోని YSRTP సైతం ఇప్పటికే ప్రముఖ గాయకుడు, కవి ఏపూరి సోమన్నను తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ పార్టీ సైతం ఇక్కడ గెలుపుపై ఆశలు పెట్టుకుంది.

  అయితే.. ఇన్నాళ్లు ఇక్కడ సైలెంట్ గా ఉన్న బీజేపీ సైతం ప్రస్తుతం వేగం పెంచింది. అధికార పార్టీలో అసంతృప్తులను తమ గూటికి రప్పించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ పని చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా.. నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర లెక్చరర్ల సంఘం (TRLS) రాష్ట్ర అధ్యక్షుడు మారోజు చంద్రశేఖర్ ను ఆహ్వానించడంతో ఆయన బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని లెక్చరర్లందరినీ ఒక తాటిపైకి తెచ్చిన ఆయన.. వారందరినీ టీఆర్ఎస్, ఉద్యమంవైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తగిన గౌరవం దక్కలేదని ఇన్నాళ్లు ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

  ఈ పరిణామాలే ఆయన బీజేపీలో చేరడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉద్యమ సమయంలో TRLS కు గౌరవ అధ్యక్షుడిగా సైతం వ్యవహరించారు. దివంగత టీఆర్ఎస్ కీలక నేత నాయిని నర్సింహారెడ్డి, నాటి జేఏసీ చైర్మన్ కోదండరామ్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన చంద్రశేఖర్ కు రాష్ట్ర స్థాయిలో లెక్చరర్లు, ఉద్యమకారులు, వివిధ ప్రముఖ సంఘాల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు తమ పార్టీ బలోపేతానికి మరింతగా కలిసివస్తాయిని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ చేరికతో ఉద్యమకారులు తమ వైపే నిలుస్తున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తుందని ఆశిస్తున్నారు. దీంతో చంద్రశేఖర్ చేరిక తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ తమకు కలిసి వస్తుందని కమలనాధులు అంచనా వేస్తున్నారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bjp, Congress, Harish Rao, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు