Bhainsa: భైంసా అల్లర్లలో 38 మంది అరెస్టు.. కీలక వివరాలు వెల్లడించిన ఐజీ నాగిరెడ్డి

భైంసా అల్లర్లు(ఫైల్ ఫొటో)

నిర్మాల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్లకు సంబంధించి 38 మందిని అరెస్టు చేసినట్టు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన హైదరాబాద్ లో వెల్లడించారు. భైంసాలో మతఘర్షణలకు దారి తీసినందున అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 26 కేసులు నమోదు చేశామన్నారు.

  • Share this:
    నిర్మాల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్లకు సంబంధించి 38 మందిని అరెస్టు చేసినట్టు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన హైదరాబాద్ లో వెల్లడించారు. భైంసాలో మతఘర్షణలకు దారి తీసినందున అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 26 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 38 మందిని అరెస్టు చేసినట్టు చెప్పిన నాగిరెడ్డి.. మరో70 మందిని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కేసులో మొత్తం 66 మందిని బైండోవర్ చేసినట్టు వెల్లడించారు. భైంసాలో మరోసారి అల్లర్లు జరగకుండా, అక్కడ శాంతిభద్రతలు నెలకొల్పేలా 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు.

    నిర్మల్ జిల్లాలోని భైంసాలో మార్చి 7వ తేదీన అల్లర్లు చెలరేగాయి. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ.. అల్లర్లకు దారితీసినట్టుగా తెలుస్తోంది. దీంతో జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే.. కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది కూడా ఉన్నారు. వారిలో కొందరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా.. తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు

    పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో బైంసాలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అయితే అప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగింది. ఇక, భైంసాలో డీఎస్పీ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విశ్వ వారియర్‌ భైంసా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇక, గతేడాది కూడా భైంసాలో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

    ఇక నిర్మల్ జిల్లా భైంసాలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరా తీశారు.  అప్పుడే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్ చేసిన అమిత్ షా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. భైంసా‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి అమిత్‌షాకు తెలియజేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక, భైంసాలో నెలకొన్న పరిస్థితులపై మరోసారి తెలంగాణ డీజీపీతో మాట్లాడినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్టు డీజీపీ తెలిపారని అన్నారు. నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని కూడా వెల్లడించారు. ఇక, అంతకు ముందు భైంసాలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. మీడియా సిబ్బందిపైన దాడి దురదృష్టకరమని.. అది తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: