Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఇపుడు తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతం పూర్తిగా మునిగిందంటూ ఢిల్లీలో తీవ్ర ఆరోపణలు చేశారు ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ వరద బాధిత జిల్లాల్లోని 20 నియోజకవర్గాల్లో ముంపు ప్రభావం తీవ్రంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో నిఘా, పరిశీలన ఎక్కడా జరగలేదన్నారు. రెవెన్యూ, పంచాయతీ, వైద్య శాఖలను ప్రభుత్వం సమన్వయం చేయలేదన్నారు. ఆదిలాబాద్ నుంచి.. ఖమ్మం జిల్లా వరకు గోదావరి పరివాహక ప్రాంతం అంతా మునిగిపోయిందని ఫైరయ్యారు పీసీసీ చీఫ్.
కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలి : రేవంత్ రెడ్డి
వరదల్లో అత్యంత పెద్ద ప్రమాదం కాళేశ్వరం ప్రాజెక్టుకే వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. మూడో టీఎంసీ సంగతి దేవుడెరుగు.. ఇంకో మూడు నాలుగేళ్లు కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. మొత్తం లిఫ్టులు, పంపులు ఎక్కడికక్కడ నీళ్లలో మునిగి జలమయమైపోయాయన్నారు.
రూ.38వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును గతంలో సంకల్పించిందన్నారు రేవంత్. దీనిని రీడిజైనింగుల పేరు మీద కేసీఆర్ రూ.లక్షనలభై వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఇందులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనీ.. మరో లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టదలిచారన్నారు. ఇంతా చేస్తే.. కాళేశ్వరం ఇవాళ నిండుగ నీట మునిగిపోయిందన్నారు రేవంత్ రెడ్డి.
కాళేశ్వరం మునిగిపోవడానికి కేసీఆర్ అవినీతి, డిజైన్ల లోపం, నిర్లక్ష్యమే కారణమన్నారు రేవంత్ రెడ్డి. అనుభవం లేని ప్రతిమ లాంటి కంపెనీలకు వేలకోట్ల రూపాయల పనులు అప్పజెప్పడంతో... ఎలా పడితే అలా నిర్మించేశారని ఆరోపించారు. ఓ మాదిరిగా వర్షాలొస్తేనే కాళేశ్వరం కుప్పకూలిపోయిందన్న రేవంత్.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బలి అయిపోయిందని ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
అవినీతిని కేసీఆర్ కవర్ చేసుకుంటున్నారు-రేవంత్
చుట్టూ పోలీసులను పెట్టి.. కాళేశ్వరానికి ఎవరినీ వెళ్లకుండా నియంత్రిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిని కేసీఆర్ కవర్ చేసుకున్నారు కానీ.. నీళ్లలో మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఎలా కాపాడతారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే నీళ్లలో మునిగిన కాళేశ్వరం వీడియోలు అందుకే మీడియాకు పంపించానన్నారు రేవంత్. ఐతే.. ఏ మీడియా ఛానెల్(వీ6 తప్ప) కూడా వాటిని పెద్దగా వినియోగించినట్టు కనిపించలేదన్నారు.
ఇప్పటికైనా కేసీఆర్ మందు మత్తు వదిలి, రాజకీయ విభేదాలు పక్కన పెట్టి వెంటనే వరద సహాయక చర్యలు ప్రారంభించాలని రేవంత్ కోరారు. రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేయడానికి ఓ వ్యవస్థను ఏర్పాటుచేయాలని కోరారు. 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. కేంద్రానికి లేఖలు రాసి సహాయం పొందాలని సూచించారు. రేపు ప్రధాని ఆఫీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కు కాంగ్రెస్ తరఫున రిప్రెజెంటేషన్ ఇస్తామన్నారు.
తెలంగాణ మీదుగా రాహుల్ పాదయాత్ర-రేవంత్
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్ కు 23శాతం ఓట్లు వస్తాయన్న సర్వేను రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీలో ధీమాగా చెప్పారు రేవంత్ రెడ్డి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా 3,600 కిలోమీటర్ల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. 150 రోజుల పాదయాత్రలో తెలంగాణ లోని మక్తల్ లో ప్రారంభమై, నారాయణ్ ఖేడ్, కొడంగల్, పరిగి, వికారాబాద్ మీదుగా.. నాందేడ్ కు వెళ్తారని తెలిపారు. కాంగ్రెస్ పాదయాత్ర, రాహుల్ టూర్ పై వివరాలు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kaleshwaram project, Kaleswaram Project, Revanth Reddy, Telangana