హోమ్ /వార్తలు /తెలంగాణ /

Maoist Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య... టీఆర్ఎస్ నేత దారుణ హత్య

Maoist Attack: ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య... టీఆర్ఎస్ నేత దారుణ హత్య

ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య... టీఆర్ఎస్ నేత హత్య

ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య... టీఆర్ఎస్ నేత హత్య

Telangana Maoist Attack: తెలంగాణలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తున్నారా... ప్రభుత్వానికే సవాల్ విసిరేందుకు కుట్రలు పన్నుతున్నారా... అసలేం జరుగుతోంది?

Telangana Maoists: తెలంగాణలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న అణచివేత ప్రయత్నాలకు సవాల్ విరుసుతున్నారు. ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌ను మావోయిస్టులు అతి కిరాతకంగా చంపేశారు. వెంకటాపురం మండలం... అలుబాకలో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రివేళ భీమేశ్వర్ ఇంటికి వచ్చిన మావోయిస్టులు... అత్యవసరంగా డబ్బులు కావాలి... ఆస్పత్రికి వెళ్లాలి అంటూ... ఆయన్ని బయటకు రమ్మన్నారు. ఇంత రాత్రివేళ తన దగ్గర డబ్బులు లేవన్న భీమేశ్వర్... డోర్ తియ్యలేదు. దాంతో మావోయిస్టులు డోర్‌పై కాల్పులు జరిపి... భీమేశ్వర్‌ను బయటకు పిలిచారు. నిద్రమత్తులోనే ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మావోయిస్టులు ఆయన్ని దారుణంగా కత్తులతో పొడిచారు. తనను చంపొద్దని మీరు ఏం చెబితే అది చేస్తానని భీమేశ్వర్ వేడుకున్నా... మావోయిస్టులు ఆగలేదు. ప్రాణాలు తీసేశారు. ఈ దారుణం జరిగినప్పుడు భీమేశ్వర్ భార్య కూడా ఆ ఇంట్లో ఉన్నట్లు తెలిసింది.

ఈ హత్య ఎవరు చేశారో అని పోలీసులు ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదంటూ... తామే హత్య చేసినట్లుగా నిరూపించేందుకు ఘటనా స్థలంలో ఓ లేఖను వదిలి వెళ్లారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల అంచనా ప్రకారం... ఈ దుశ్చర్యలో మొత్తం ఆరుగురు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. తమ లేఖలో మావోయిస్టులు... టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఎప్పట్లాగే కొన్ని డిమాండ్లు చేశారు. అధికార పార్టీలో ఉంటూ... ప్రజలను దోచుకుంటున్నారని లేఖలో ఫైర్ అయ్యారు. తాము చెప్పినట్లు రాజీనామా చేయకపోతే... వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

ములుగుపై ప్రభుత్వం ఫోకస్:

తెలంగాణలో మావోయిస్టుల అలజడి పెరగడంతో... ప్రభుత్వం ఈ మధ్య ఆదిలాబాద్, ములుగు జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అటు ఛత్తీస్‌గఢ్‌‌ బోర్డర్‌‌లో అధిక సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్‌‌ అయ్యింది. మావోయిస్టుల అణచివేతకు బీఎస్‌‌ఎఫ్‌ను రంగంలోకి దించింది. సీఆర్‌‌పీఎఫ్‌‌తోపాటు బీఎస్ఎఫ్‌‌ బలగాలు సైతం అడవులను జల్లెడ పట్టడానికి రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా బీఎస్‌‌ఎఫ్‌, సీఆర్‌‌పీఎఫ్‌‌‌కు చెందిన ఉన్నతాధికారులు ఐదు రోజుల కిందట రెండు ప్రత్యేక హెలీకాప్టర్లలో వచ్చారు. అంతేకాదు... గత ఆదివారం ములుగు జిల్లాలోని వెంకటాపురం పోలీస్‌‌ స్టేషన్‌‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి, స్మగ్లర్‌‌ వీరప్పన్‌‌ను ఎన్‌‌కౌంటర్‌‌ చేసిన సీఆర్‌‌పీఎఫ్‌ ఉన్నతాధికారి విజయ్‌‌ కుమార్‌‌, ‌తెలంగాణ, ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల సీఆర్పీఎఫ్‌ డీజీపీలు, ఐజీ నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్‌‌ ఐజీ స్టీఫెన్‌‌ రవీంద్ర, బస్తర్‌‌ రేంజ్‌‌ ఐజీ సుందర్‌‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సమావేశం జరిగింది. మీటింగ్‌‌లో ముఖ్యంగా మావోయిస్టుల అణచివేత అంశంపైనే చర్చ జరిగినట్లుగా రాష్ట్ర పోలీస్‌‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో ఉలిక్కిపడుతున్న మావోయిస్టులు తాజా ఘాతుకంతో... పోలీసులకు సవాల్ విసిరినట్లైంది.

అక్కడే మావోయిస్టుల కదలికలు:

తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలను మావోయిస్టులు తమ సేఫ్‌‌ జోన్‌గా మలచుకున్నారు. ములుగు, భద్రాచలం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌‌ తదితర జిల్లాల్లోని దట్టమైన అడవిలో నివసించే గిరిజనులను తమకు అనుకూలంగా మార్చుకుని కరపత్రాలను పంపిణీ చేయటం, పలు విధ్వంసక, అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. ఏజెన్సీ కేంద్రంగా తమ బలాన్ని పెంచుకుంటున్నారు. ఏజెన్సీ సరిహద్దుల్లో అనునిత్యం డేగ కన్నుతో కాపలా కాస్తూ, అడవిలో కూంబింగ్ చేసే పోలీసు పార్టీలకు కరోనా సోకడంతో కొద్ది రోజులు కూంబింగ్‌‌లు ఆగిపోయాయి. దీంతో మావోయిస్టులు అడవిలో ఒక పల్లె నుంచి మరో పల్లెకు స్వేచ్ఛగా తిరగడం, యువతను వారికి అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌‌ రాష్ట్ర సరిహద్దుల్లో నుంచి భారీ సంఖ్యలో మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు కేంద్ర నిఘావర్గాలు సైతం ధ్రువీకరించాయి. భద్రాచలం, ఆసిఫాబాద్‌‌ జిల్లాల్లో ఇటీవల మావోయిస్టుల ఎన్‌‌కౌంటర్లు జరిగాయి. ఇదీకాక మావోయిస్టులు వందల సంఖ్యలో కొత్త రిక్రూట్‌‌మెంట్‌‌ చేసుకున్న విషయం బయటపడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌‌ విభాగం సైతం అప్రమత్తమైంది. వారం రోజులుగా బీఎస్‌‌ఎఫ్‌‌కు చెందిన హెలీకాప్టర్‌‌ అడవిలో తిప్పి సమాచారం సేకరించారు. సెంట్రల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ హెచ్చరికలతో తెలంగాణ, చత్తీస్‌గఢ్‌‌ రాష్ట్ర పోలీస్‌‌ విభాగాలకు సహకరించడానికి బీఎస్‌‌ఎఫ్‌‌, సీఆర్‌‌పీఎఫ్‌‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు తాజా ఘాతుకానికి పాల్పడ్డారు.

First published:

Tags: Maoist attack, Telangana News

ఉత్తమ కథలు