హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణ కొత్త సచివాలయానికి 'అంబేద్కర్' పేరు.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Telangana: తెలంగాణ కొత్త సచివాలయానికి 'అంబేద్కర్' పేరు.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Secretariat: భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై తాను భారత ప్రధాని నరేంద్ర మోదీకి త్వరలోనే లేఖ రాస్తానని స్పష్టం చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి (Telangana New Secretariat) ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ (Baba Saheb Ambedkar) పేరును పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని.. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నవని పేర్కొన్నారు. డా. బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

  ''అంబేద్కర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉంది. ఫెడరల్ స్పూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్పూర్తి మమ్మల్ని నడిపిస్తోంది. భారత దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలను సమానంగా గౌరవించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడమే నిజమైన భారతీయత. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతుంది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.'' అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

  అటు భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదని.. భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిాంచిందని అన్నారు. ఇదే విషయమై తాను భారత ప్రధానికి త్వరలోనే లేఖ రాస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి పెట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: B. R. Ambedkar, CM KCR, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు