Hyderabad Floods: మూసీ నదికి పూజలు.. 1908 నాటి తరహాలో..

Hyderabad Floods: 1908లోనూ భారీ వరదలు సంభవించడంతో నాటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ కూడా మూసీ నదికి ప్రత్యేక పూజలు చేశారు.

news18-telugu
Updated: October 21, 2020, 5:40 PM IST
Hyderabad Floods: మూసీ నదికి పూజలు.. 1908 నాటి తరహాలో..
మూసీ నదికి ప్రత్యేక పూజలు చేసేందుకు వెళుతున్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు
  • Share this:
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. కొద్దిరోజుల నుంచి నగరవాసులకు వణికిస్తున్న మూసీ నది వరదలు.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కురిసిన అతి భారీ వర్షాలకు మూసీ నది పోటెత్తింది. దాంతో నగరంలోని మూసీ పరివాహక ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో మూసీ నది శాంతించాలంటూ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పురానాపూల్ వద్ద మూసీ నదికి శాంతి పూజలు చేశారు. గంగమ్మ తల్లికి బోనం సమర్పించడంతో పాటు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 1908లోనూ భారీ వరదలు సంభవించడంతో నాటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ కూడా మూసీ నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మూసీ నదికి అంతటిస్థాయిలో భారీ వరదలు రావడం మళ్లీ ఇదే తొలిసారి కావడంతో.. నదికి శాంతి పూజలు నిర్వహించారు.

హైదరాబాద్ వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకోసం సీఎం సహాయనిధి నుంచి రూ.550కోట్లు కేటాయించింది. ముగ్గురు అధికారుల కమిటీ ద్వారా బాధితులకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇందుకు కుటుంబ, భౌగోళిక వివరాలను యాప్‌లో పొందుపరచాలని ప్రభుత్వం అధికారులను సూచించింది. మొత్తం ప్రక్రియను వారంరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ.లక్ష సాయం, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.

అధికారులు బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆధార్‌, రేషన్‌ కార్డుల వివరాలను నమోదు చేయాలని, డూప్లికేషన్‌కు తావు లేకుండా ఒకేసారి అందేలా చూడాలని చెప్పింది. కుటుంబ యజమానితో పాటు ముగ్గురు అధికారుల సంతకాలు చేయాలని, ఇతర నగర, మున్సిపాలిటీల్లోనూ ఇదే విధానం అమలు చేయాలని చెప్పింది. పలు చోట్ల మంత్రులు స్వయంగా వరద బాధితులకు ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను అందజేస్తున్నారు.

ఇదిలా ఉంటే భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందిపడుతున్న హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు కూడా తమ వంతు సాయం ప్రకటించాయి. తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించగా.. బెంగాల్ ప్రభుత్వం రూ. 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది.
Published by: Kishore Akkaladevi
First published: October 21, 2020, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading