టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) ఇరకాటంలో పడేశారు. ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి హల్‌చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు (Gun firing) జరిపారు మంత్రి. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేశారు శ్రీనివాస్ గౌడ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి కాల్పులు ఎలా జరుపుతారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఫైర్ చేస్తున్నా అధికారులు అడ్డుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు.
@TelanganaCMO @KTRTRS @TelanganaDGP @CPHydCity @AmitShah తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు.. పోలీసు తుపాకీతో కాల్పులు జరిపిన మంత్రి.... Minister firing.... pic.twitter.com/d8iiHwBeZb
— Aravind Sharma (@MAravindSharma1) August 13, 2022
ఫ్రీడం ర్యాలీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే తుపాకులతో కవాతులు నిర్వహించాలని ఎక్కడా లేదు. మహబూబ్ నగర్‌లోనూ ఇలా పోలీసులు తుపాకులతో కవాతులు నిర్వహించలేదు. కానీ మంత్రి గారు పాల్గొంటున్నారన్న ఉద్దేశంతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు కార్యక్రమం కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన వారిలో తన పక్కన ఉన్న పోలీసు అధికారి నుంచి ఎస్ఎల్ఆర్ వెపన్‌ను తీసుకున్న శ్రీనివాస్ గౌడ్ ఊహించని విధంగా కాల్పులు జరిపేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ..
అయితే కాల్పుల ఘటన తెలంగాణలో చర్చనీయాంశం కావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తాను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అంటూ మంత్రి వివరణ ఇచ్చారు. తను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని తాను ఎవరి వద్ద గన్ తీసుకొని కాల్చలేదని స్వయంగా ఎస్పీ ఇస్తేనే కాల్చానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. టీవీలో వస్తున్న కథనాలపై స్పందించారు తనపై అసత్య కథనాలతో బురద జల్లుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ఫోన్ లైన్ లో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుండి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన అతిపెద్ద ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను అర్పించి తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు పోవాలని, మానవత్వంతో ప్రతి ఒక్కరు ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధిలో ముందుకు పోవాలని, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలని, అసమానత్వం పోవాలని, అభివృద్ధిలో యువత ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం అన్ని రంగాలలో అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తన స్వార్థం కోసం కాకుండా ఇతరుల బాగు కోసం కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం అందిన నాడే మనం నిజమైన అభివృద్ధిని సాధించిన వారమవుతామని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ ,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
స్వతంత్ర వజ్రోత్సవ ర్యాలీకి భారీగా జనం..
స్వతంత్ర వజ్రోత్సవ ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. సుమారు పదివేల మంది యువత, విద్యార్థులు, ఎన్ సి సి, స్కౌట్స్, గైడ్స్, మహిళలు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు ప్రతి ఒక్కరు జెండాలు, త్రివర్ణ పతాక బెలూన్లు, ప్లే కార్డులు చేత పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Azadi Ka Amrit Mahotsav, Gun fire, Mahbubnagar, Srinivas goud