హోమ్ /వార్తలు /తెలంగాణ /

Minister KTR: ‘‘పట్టణ ప్రజల కోసం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టండి’’: కేంద్రానికి మంత్రి కేటీఆర్​ లేఖ

Minister KTR: ‘‘పట్టణ ప్రజల కోసం కూడా జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టండి’’: కేంద్రానికి మంత్రి కేటీఆర్​ లేఖ

మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్​

పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పుకు చేపట్టాల్సిన కార్యక్రమాల పైన సవివరమైన సూచనలను మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు

దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (National Rural Employment Guarantee Scheme) మాదిరి ఒక ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని రానున్న బడ్జెట్ సమావేశాల్లో పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​ (Minister KTR) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పుకు చేపట్టాల్సిన కార్యక్రమాల పైన సవివరమైన సూచనలను మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) కు రాసిన లేఖలో (Wrote Letter) ప్రస్తావించారు. పట్టణీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామం (ట్రెండ్) అని, ఇందుకు భారతదేశం ఏ మాత్రం మినహాయింపు కాదని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. మెరుగైన ఉపాధి జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలవైపు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపైన తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని, ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుందని, 2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతుందని కేటీఆర్ (Minister KTR)​ తెలిపారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉన్నదన్నారు.

పెద్ద ఎత్తున పట్టణాల్లోకి ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణ పేదరికం (Urban poverty) పైన దేశంలోని అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు కేటీఆర్ (Minister KTR)​. పట్టణ పేదలకు అవసరమైన హౌసింగ్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం , విద్య, సామాజిక భద్రత , జీవనోపాధుల వంటి అంశాల పైన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పట్టణంలోని పేదలకు పైన పేర్కొన్న అంశాల్లో సరైన అవకాశాలు కల్పించినప్పుడే వారు నాణ్యమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ (Minister KTR)​ తెలిపారు.

నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలంటే..

పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవితాన్ని (Quality life) అందుకోవాలంటే వారి ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని, అయితే దురదృష్టవశాత్తు పట్టణ పేదలు అత్యధిక శాతం అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పని చేస్తున్న పరిస్థితి ఉందని కేటీఆర్​ (Minister KTR) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కరోజు ఉపాధి దొరకక ఉంటే వారి జీవన స్థితిగతులు తారుమారయ్యే దయనీయమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారి ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ, భరోసాను ఇచ్చే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణాల్లోని పేదల కోసం చేపట్టాలని మంత్రి కేటీఆర్  (Minister KTR) కేంద్రానికి సూచించారు.

ఉపాధి హామీ అవసరాన్ని నొక్కి చెప్పాయి..

ఇప్పటికే ప్రభుత్వం నియమించిన పలు కమిటీలు, దేశంలోని వివిధ సంస్థలు పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఒక ఉపాధిహామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన విషయాన్ని మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. గతంలో పార్లమెంట్ సభ్యుడు భర్తుహరి మహతాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మరియు సిఐఐ లాంటి సంస్థలు పట్టణ ప్రాంతాల్లోని ప్రజల సామాజిక భద్రతను పెంచేందుకు పట్టణ ఉపాధిహామీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.

పట్టణం పేదరికం పెరిగే అవకాశం..

ప్రస్తుతం పట్టణాల్లో నెలకొని ఉన్న పరిస్థితులతో పాటు సమీప భవిష్యత్తులో పెరిగే పట్టణ పేదరికం అంచనాల నేపథ్యంలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో పట్టణ పేదల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం సముచితంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ కేంద్రానికి తెలిపారు. పట్టణ ప్రాంతాల వైపు భారీగా వలస వస్తున్న గ్రామీణ పేదల కోసం పట్టణాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయస్థాయిలో అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం కేవలం పట్టణాలకే ఉన్నదని, అయితే ఈ అసంఘటిత రంగంలో పేదలు పని చేసేందుకు వీలు కల్పించేలా వారికి నైపుణ్య అభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లుషన్, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం వంటి అనేక చర్యలను తాను ప్రతిపాదించే ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని కేటీఆర్​ సూచించారు.

ఆ ఘటనలు పునరావృతం అవ్వొద్దు..

లాక్డౌన్ సమయంలో దేశం చూసిన హృదయవిదారకమైన పట్టణ పేద ప్రజల వలస సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలంటే, పట్టణ అసంఘటిత రంగాన్ని మరింత బలోపేతం చేయడం మాత్రమే మార్గమని కేటీఆర్ తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రజలు భారీ ఎత్తున ఇతర రాష్ట్రాల్లోని పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉన్నందున దేశంలోని ఎక్కడివారైనా ఏ పట్టణంలోనైనా ఈ ఉపాధి హామీ లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని కేటీఆర్ సూచించారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లు..

దేశంలోని పట్టణాలు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్లుగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తించాలని, ఇంతటి ప్రాధాన్యత కలిగిన పట్టణ ప్రాంతాల్లోని పేదలకు చేయూత అందించాల్సిన అవసరం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగర ప్రభుత్వాలైనా పురపాలికల పై కూడా ఉందన్నారు కేటీఆర్​. ఇవి తమ పరిధిలో చేపట్టే హరితహారం లాంటి గ్రీనరీ కార్యక్రమాలు, పట్టణాలలో చేపట్టే ఫుట్ పాత్ లు, డ్రైనేజీల నిర్మాణము వంటి ప్రాథమిక మౌలిక వసతుల నిర్వహణ వంటి కార్యక్రమాల్లో పట్టణ పేద ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ వారి ఉపాధులకు హామీ ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉందని కేటీఆర్​ తెలిపారు

ప్రస్తుతం ఉన్న అనిశ్చితమైన ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలను దాటుకుని పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందుకోవాలంటే, వారి ఉపాదులకు మరింత హామీ కల్పించడమే మాత్రమే ఏకైక పరిష్కార మార్గమని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రత్యేక పట్టణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి పంపిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

First published:

Tags: Finance minister, Minister ktr, Nirmala sitharaman, Union government

ఉత్తమ కథలు