గోవాలో నిర్మల సీతారామన్‌తో మంత్రి హరీష్ రావు భేటీ

హరీష్ రావు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన నిర్మల... బీడీలు చేసే మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై సమగ్రమైన ప్రతిపాదనలు అందచేయాలని ఆయన్ను కోరారు.

news18-telugu
Updated: September 20, 2019, 7:00 PM IST
గోవాలో నిర్మల సీతారామన్‌తో మంత్రి హరీష్ రావు భేటీ
నిర్మలా సీతారామన్‌తో హరీష్ రావు భేటీ
  • Share this:
బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు బీడీ పరిశ్రమపైనే ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. శుక్రవారం గోవాలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు..అనంతరం నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి, భారీగా పన్నులు విధించడంతో బీడీల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదన్నారు. ప్రస్తుతం బీడీలపై 28 శాతం, బీడీ ఆకులపై 18 శాతం జిఎస్టీ ఉందని, ఇంత మొత్తంలో బీడీలపై పన్నులు ఉండడం వల్ల పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. మహిళల ఆర్థిక పరిస్థితులతో సంబంధం కలిగిన అంశం కాబట్టి, బీడీలపై జిఎస్టీని ఉపసంహరించాలని మంత్రి హరీష్ కోరారు.

బీడీ వ్యాపారంపై పడే ప్రభావం లక్షలాది మంది మహిళల జీవితాలతో ముడిపడి ఉందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ పరిశ్రమల్లో 90 శాతానికిపైగా పేద మహిళలే ఉన్నారని, బీడీలు చుట్టడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినప్పటికీ జీవనోపాధి తప్పడం లేదని చెప్పారు. బీడీ కార్మికులను ఆదుకోవడం కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.2016 చొప్పున ఆసరా పెన్షన్ అందిస్తోందని వెల్లడించారు. బీడీ కార్మికుల జీవనోపాధి కోసం ప్రత్యేక ఆర్థిక ప్రేరణ కార్యక్రమాలు తీసుకురావాలని నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

హరీష్ రావు విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన నిర్మల... బీడీలు చేసే మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై సమగ్రమైన ప్రతిపాదనలు అందచేయాలని ఆయన్ను కోరారు. బీడీ కార్మికుల పునరావాసం కోసం ఆలోచన చేస్తే, దేశమంతటికీ ఉపయోగపడే విధానం తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులు ఉన్నారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు