హుజూరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ నేతలు తమ స్ట్రాటజీని మార్చుతున్నారు. ఈటల రాజేందర్ పై వేటు వేసిన తర్వాత ఆపార్టీకి చెందిన జిల్లా నేతలను ఆయన్ను కట్టడి చేసేందుకు రంగంలోకి దింపారు. ఇందులో భాగంగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రులు అయిన గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాత్రమే ఈటలపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంతో పాటు పార్టీని నియోజకవర్గంలో చక్కబెడుతున్నారు.
అయితే ఈటల రాజేందర్ రేపటి నుండి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనుండడంతో పాటు బీజేపీ రాష్ట్ర నేతలు మొత్తం హుజూరాబాద్ పై దృష్టి సారించారు. ఈటలను గెలిపించుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే జాతీయ స్థాయి నేతలను కూడా హుజూరాబాద్‌కు రప్పించేందుకు ప్రణాళికలు రూపోందించారు.
ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినాయకత్వం అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది..నియోజకవర్గంలో ఈటలను అడ్డుకునేందుకు ఇప్పటికే పలు ప్రయత్నలు చేస్తున్న గులాబి పార్టీ, తాజాగా ఆయనపై పార్టీ అగ్రనేతలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మొదటిసారిగా మంత్రి హరీష్ రావు ఈటలపై విమర్శలను సంధించారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఆయన ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ అన్నం పెట్టి, రాజకీయంగా ఓనమాలు నేర్పిస్తే ఆయన బతికి ఉండగానే ఈటల రాజేందర్ సీఎం కావాలని ప్రయత్నాలు చేశారన్నారు. రైతుబంధు దండగ అని.. కళ్యాణలక్ష్మి పథకంతో ఒరిగింది ఏమీ లేదని మాట్లాడితే ..కేసీఆర్ గుండెకు ఎంత గాయం అయ్యిందో ఈటల అర్ధం చేసుకోవాలన్నారు. మంత్రి పదవి ఇచ్చాక కూడా.. టీఆర్ఎస్ పార్టీకి తామే ఓనర్ల మంటూ ఈటల ఎందుకు మాట్లాడారన్నారు.
మరోవైపు బుధవారం మంత్రి కేటీఆర్ సైతం ఈటలను విమర్శించారు. ఈటల ఆత్మవంచనకు పాల్పడ్డారని అన్నారు. ఈటల తప్పు చేసినట్టు అంగీకరించారని అన్నారు. మంత్రి వర్గంలో ఉండి తన అసంతృప్తి వ్యక్తం చేయకుండా మంత్రి మండలి నిర్ణయాలను బయట విమర్శించాడని విమర్శించాడు. అయినా.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ గౌరవించారని అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన స్పందించడంతో పాటు హుజూరాబాద్ ఎన్నికలు రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించి ఈటల వల్ల పార్టీకి నష్టం లేదనే సంకేతాలను ఇచ్చాడు. సో.. మొత్తం మీద ఈటల ఎపిసోడ్ తర్వాత పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగడంతో రానున్న రోజుల్లో ఇరు పార్టీల మధ్య మరింత మాటల యుద్దం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Harish Rao