తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక రోజు రోజుకూ హీట్ పెంచుతోంది. ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వానికి తిరుగు లేదని నిరూపించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు మంత్రులు సైతం నియోజవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంపై తనదైన స్టైల్లో ఫోకస్ పెట్టారు. ఇన్నాళ్లు సొంత నియోజకవర్గం సిద్దిపేట నుంచే హుజూరాబాద్ లో పరిస్థితులను చక్కదిద్దిన మంత్రి హరీశ్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. హజూరాబాద్ లో పర్యటిస్తూ పార్టీలో జోష్ పెంచుతున్నారు. అయితే.. హుజూరాబాద్ లో కేవలం విమర్శలకే పరిమితం కాకుండా కొత్త వ్యూహాన్ని హరీశ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు మూడు సమావేశాల్లో ఆయన డబుల్ బెడ్రూం ఇళ్లు, మహిళా సంఘాల భవనాల ప్రస్తావన తెచ్చారు. హుజూరాబాద్ ను ఈటల రాజేందర్ నిర్ల్యక్ష్యం చేశారని.. అందుకే ఒక్క డబల్ బెడ్రూం ఇల్లు కూడా ఏడేళ్లుగా కట్టలేక పోయాడని విమర్శలు గుప్పించారు హరీశ్. తన సిద్దిపేట నియోజవర్గంలో ఏ ఊరికి వెళ్లినా డబల్ బెడ్రూం నివాసాలు కనిపిస్తాయనన్నారు. ఈటల రాజేందర్ మహిళా సంఘాల భవనాలను కూడా కట్టించలేకపోయారని మండిపడ్డారు హరీశ్.
Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా ? సీనియర్ నేతలు అడ్డుపడుతున్నారా ?
ఇన్నాళ్లు తాము ఇక్కడంతా బాగానే ఉందని అనుకున్నామన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. ఇక మీదట నుంచి హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యతను తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు ప్రజలకు భరోసా ఇస్తున్నారు హరీశ్ రావు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని కోరుతున్నారు. మొదట రెండు గుంటలు రెండు వందల ఎకరాలకు పోటీ అంటూ ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ ఇప్పుడు కొత్త అస్త్రాన్ని ఎంచుకున్నారు. అభివృద్ధి విషయంలో ఈటల ఇప్పటివరకు నిర్లక్ష్యం వహించారని, దత్తత గ్రామాలకు కూడా పట్టించుకోలేదని లెక్కలతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సిద్దిపేట లెక్కలే కాకుండా ఖమ్మం జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలోని డబుల్ ఇళ్ల లెక్కలను, అభివృద్ధి పనుల వివరాలను కూడా చెబుతున్నారు మంత్రి హరీశ్.
ఇలా చేయడం వల్ల ఈటలతో పాటు బీజేపీ నేతలను సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి నెట్టాలన్నది హరీశ్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే దుబ్బాకలో బీజేపీకి కలిసి వచ్చిన ‘అభివృద్ధిలో వెనకబడ్డాం’ అన్న ప్రచారం ఇక్కడ తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అయితే.. హరీశ్ రావు అనుసరిస్తున్న ఈ కొత్త వ్యూహం టీఆర్ఎస్ ను విజయానికి చేరువ చేస్తుందో? లేదో? అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Eetala rajender, Etala rajendar, Huzurabad By-election 2021, Telangana, Telangana bjp, Telangana Politics