తెలంగాణ బాటపట్టిన బీహార్ వలస కార్మికులు.. రివర్స్ మైగ్రేషన్

ప్రతీకాత్మక చిత్రం

రైస్ మిల్లులలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. వారిని లింగంపల్లి స్టేషన్‌లో స్క్రీనింగ్ చేసిన అనంతరం.. ప్రత్యేక బస్సుల్లో నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సిద్ధిపేట సహా పలు ప్రాంతాలకు తరలించారు.

 • Share this:
  లాక్‌డౌన్ వల్ల వలస కార్మికుల బాధలు అన్నీ ఇన్నీ కావు. చేతిలో పనుల్లేక.. ఇక్కడే లేక.. ఎంతో మంది సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. కొందరు కాలినడకన వెళ్తుంటే... పాస్‌లు వచ్చిన వాళ్లు శ్రామిక్ రైళ్లలో వెళ్లిపోతున్నారు. తెలంగాణ నుంచి ఇప్పటికే పలు శ్రామిక్ రైళ్లు ఝార్ఖండ్, బీహార్‌ సహా పలు రాష్ట్రాలకు వెళ్లాయి. ఐతే శుక్రవారం మాత్రం అరుదైన దృశ్యం ఆవిష్క‌ృతమైంది. వలస కార్మికులంతా సొంతూళ్లకు వెళ్తుంటే.. బీహార్ నుంచి వలస కార్మికులు మాత్రం తిరిగి తెలంగాణ బాటపట్టారు. అవును తెలంగాణలో రివర్స్ మైగ్రేషన్ మొదలయింది.

  బీహార్‌లోని ఖగారియా నుంచి ప్రత్యేక శ్రామిక్ రైలులో 225 మంది వలస కూలీలు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం నగర శివారులోని లింగంపల్లి స్టేషన్‌కు రైలు చేరుకుంది. వీరి తరలింపును రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అజయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. ఇక లింగంపల్లికి చేరుకున్న బీహార్ వలస కార్మికులకు రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్, రైతు బంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పువ్వులు అందించి స్వాగతం పలికారు.

  తెలంగాణలో యాసంగి పంటలు చేతికొచ్చాయి. ప్రధానంగా వరి కోతలు ఊపందుకొని ధాన్యం రైస్ మిల్లులకు చేరుతోంది. ఈ క్రమంలో రైస్ మిల్లులలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు తిరిగి తెలంగాణకు చేరుకున్నారు. వారిని లింగంపల్లి స్టేషన్‌లో స్క్రీనింగ్ చేసిన అనంతరం.. ప్రత్యేక బస్సుల్లో నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, సిద్ధిపేట సహా పలు ప్రాంతాలకు తరలించారు. ప్రయాన సమయంలో వారికి నీళ్ల సీసాలు, ఆహార పొట్లాలు, మాస్క్‌లు అందజేశారు అధికారులు. అన్ని రాష్ట్రాల్లో వలస కార్మికులు సొంతూర్లకు వెళ్తుంటే.. తెలంగాణలో రివర్స్ మైగ్రేషన్ మొదయిందని సంతోషంగా ఉందన్నారు నేతలు.

  ఏప్రిల్ 20న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల సీఎస్‌లకు లేఖరాశారు. తెలంగాణలో పనిచేసే 20 వేల మంది కార్మికులు పండగ కోస వెళ్లి అక్కడే ఉండిపోయారని.. కూలీల కొరత కారణంగా రాష్ట్రంలో వరి కోతల సమయంలో 2600ల రైస్ మిల్లులు ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంతో తిరిగి తెలంగాణకు రావాలనుకుంటున్న కూలీలను.. అనుతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దానిపై స్పందించిన బీహార్ ప్రభుత్వం.. తెలంగాణకు వెళ్లదలచుకున్న కూలీలను ప్రత్యేక రైళ్లలో పంపించినట్లు సమాచారం.
  Published by:Shiva Kumar Addula
  First published: