Telangana Liberation Day: నేడు తెలంగాణ విమోచన దినోత్సవం.. నిజాం నుంచి స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం గుర్తుంచుకోవడం మన హక్కు..

హైదరాబాద్((Photo: Shutterstock)

చరిత్ర అనేది భావితరానికి సాక్ష్యం.. రానున్న సమాజానికి గత కాలపు ఔన్నత్యాన్ని చాటే నిజం. అయితే చాలా సందర్భాల్లో భారత చరిత్ర పుటల్లోని వాస్తవాలు కనుమరుగయ్యాయి.

  • Share this:
(వ్యాసకర్త : జి కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి)

చరిత్ర అనేది భావితరానికి సాక్ష్యం.. రానున్న సమాజానికి గత కాలపు ఔన్నత్యాన్ని చాటే నిజం. అయితే చాలా సందర్భాల్లో భారత చరిత్ర పుటల్లోని వాస్తవాలు కనుమరుగయ్యాయి. ప్రజలు తమ సొంత చరిత్రను తెలుసుకోనివ్వకుండా అడ్డుకోవడం, నివారించడమనేది.. వినాశనానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం అని జార్జ్ ఆర్వెల్ చెప్పినట్లుగా గతాన్ని తెలుసుకోకపోతే భవిష్యత్తుకు గుర్తింపు లేనట్లే. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రాచీనకాలం నుంచి మనదేశంలో ఎన్నో ఘటనలు చరిత్ర పుటలకు దూరమయ్యాయి. ముఖ్యంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో(Indian independence movement) కొన్ని ఉదంతాలు తెరపైకి వచ్చాయి. ఎంతో మంది వీరుల త్యాగాలు చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు. నిజాం బారి నుంచి తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటం కూడా ఈ కోవలోకే వస్తుంది.

1947లో భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన తెలుగు గడ్డపై జరిగిన యదార్థ గాధ ఇది. 1946 నుంచి 1948 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో దేశానికి తెలియని, చరిత్రలో స్థానం దక్కని పోరాటం వెలుగుచూసింది. హైదరాబాద్ రాష్టాన్ని నిజాం పాకిస్థాన్ లో లేదా స్వతంత్ర దేశంగా ఉంచాలని ఆలోచన చేశారు. ఇందుకు బ్రిటన్ కూడా మౌనంగా మద్దతు ఇచ్చింది. నాటి హైదరాబాద్ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఇండియన్ యూనియన్(Indian Union) లో విలీనం కావాలని కోరుకున్నారు. నేటి తెలంగాణ, ఈశాన్య కర్ణాటక, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం నిజాం పాలనలో ఉండేది.

Amit Shah: నేడు తెలంగాణకు హోంమంత్రి అమిత్ షా.. నిర్మల్‌లో భారీ బహిరంగ సభ

* ఆపరేషన్ పోలో..
అప్పుడు నిజాం సైన్యంతో పాటు, ఖాసీం రిజ్వీ నేతృత్వంలోని ప్రైవేటు మిలిటరీ అయిన రజాకార్లు.. అమాయక, నిరాయుధలైన పౌరులపై భయంకరమైన హింసాకాండకు దిగారు. ఈ క్రమంలో రజాకార్లను అడ్డుకునేందుకు ప్రజలు తిరుగుబాటు చేశారు. 1948 సెప్టెంబర్ ప్రారంభంలో పర్కాలా, బైరాన్ పల్లిలో(Bairanpally) జరిగిన మారణకాండలో ఎంతోమంది అసువులు బాశారు. ఈ ఘటనల అనంతరం సర్దార్ వల్లాభాయ్ పటేల్ నిజాంతో పోరాటానికి 'ఆపరేషన్ పోలో'(Operation Polo) అనే పోలీసు చర్యను ప్రారంభించారు. ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనమైంది. ఈ విలీనానికి గుర్తుగా ఈ రోజును తెలంగాణ విమోచన లేదా విలీన దినంగా (Telangana Liberation Day)చెబుతారు. అప్పటి నుంచి ఈ రోజును నామమాత్రంగానే జరుపుకుంటున్నారు.

Telangana News: దారుణ ఘటన.. ఒక్క మర్రిచెట్టుకు.. వెయ్యి మంది ఉరితీత.. అసలు ఆరోజు ఏం జరిగింది..

* రాజకీయ ఒత్తిళ్లు..
ఈ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ నిరంతరం డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికార టీఆర్ఎస్(TRS) మాత్రం తమ మిత్రపక్షమైన మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గినట్లు కనిపిస్తుంది. 2001 నుంచి 2014 మధ్యకాలంలో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించనందుకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులను కేసీఆర్(CM K Chandrasekhar Rao) తప్పుపట్టారు. అయితే తదనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ప్రస్తుత అధికార పార్టీ మిన్నకుండటం గమనార్హం.

ముస్లిం మజ్లిస్ పార్టీ (MIM)తెలంగాణ విమోచనాన్ని మత కోణంలో చుస్తోంది. అంటే ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా హిందువుల పోరాటంగా చూస్తోంది. ఇదే సమయంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లింలను బలహీనపరుస్తుంది. షోయబుల్లా ఖాన్ లాంటి సామాన్యులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి చివరకు తన జీవితాన్ని బలిపెట్టాల్సి వచ్చింది. కాబట్టి ప్రజల పోరాటాలను మతం లేదా ప్రాంతం కోణంలో చూడటం తప్పు. తెలంగాణ ఉద్యమాన్ని నిశితంగా పరిశీలిస్తే రెండు అంశాలు వెలుగులోకి వస్తాయి. మొదటిది ఈ పోరాటం నిజాంపై మాత్రమే కాదు.. ఆయన అడుగులకు మడుగులొత్తి ప్రజలను అణచివేతకు గురిచేసిన భూస్వాములపై జరిగింది. రెండో అంశం భారత యూనియన్ లో చేరడానికి ప్రజల దృఢ సంకల్పాన్ని తెలియజేసింది.

ఈ పోరాటంలో ప్రజల త్యాగాలను భవిష్యత్తు తరాలు తెలుసుకోవడం అనేది వారి నైతిక హక్కు. ఇందుకు తగిన ఆధారాలు సమకూర్చడం అవసరం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడమనేది చరిత్రకు సంబంధించిన అత్యంత విలువైన డాక్యుమెంటేషన్. ఇది వీరుల త్యాగాలపై దృష్టి పెట్టేందుకు చేసే ప్రయత్నం. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి మజ్లిస్ బలవంతపు బెదిరింపుల నుంచి టీఆర్ఎస్ విమోచనం పొందాలి.
Published by:Sumanth Kanukula
First published: