TELANGANA IS ALL SET TO HIKE ELECTRTICITY TARIFF CHARGES AS TSERC TELLS POWER DISCOMS DUE TO HUGE LOSSES MKS
telangana: అన్ని వర్గాలకూ భారీ షాక్ -ఎప్పటి నుంచంటే.. రూ.21,550 కోట్ల లోటుంది మరి!
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు
నిజానికి ఈ షాక్ ముందే తగలాల్సి ఉంది. కరెంటు చార్జీలు పెంచుతామని సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ కరోనా విలయం కారణంగా సదరు నిర్ణయం అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మంత్రివర్గ సమావేశంలో కరెంట్ చార్జీల పెంపునకు ఆమోదం తెలుపవడంతో ఎట్టకేలకు డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు సమర్పించాయి. తద్వారా కరెంటు చార్జీల పెంపు ఖాయమైంది..
ధనిక రాష్ట్రంగా, విద్యుత్ సరఫరాలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నామని చెప్పే కేసీఆర్ సర్కారు.. అదే కరెంటు విషయంలో ప్రజలకు భారీ షాకివ్వడం ఖాయంగా మారింది. తెలంగాణలో కరెంట్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లు(వార్షిక ఆదాయ అవసరాలు) ఈ అంశాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుత (2021-22), వచ్చే (2022-23) ఆర్థిక సంవత్సరాలకు కలిపి రూ.21,550 కోట్ల లోటును చూపించిన డిస్కంలు.. చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించింది. లోటు పూడటానికి మరో మార్గం లేదు కనుక టారీఫ్ ఛార్జీలు ప్రకటించిన తర్వాత పబ్లిక్ హియరింగ్ నిర్వహించి కరెంట్ ఛార్జీల పెంపుకు అనుమతిస్తామని ఈఆర్సీ తెలిపింది.
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను కూడా ఇంత భారీ లోటుతో ఉన్నట్లు డిస్కంలు తెలిపాయి. 2021-22కు సంబంధించి ఏఆర్ఆర్ రూ.45,618 కోట్లు కాగా, 2022-23కుగాను రూ.53053 కోట్లుగా పేర్కొన్నాయి. డిస్కమ్‌లకు వచ్చే ఆదాయం 2021-22లో రూ.29,343 కోట్లు, 2022-23లో రూ.36,474 కోట్లుగా తెలిపాయి. ఇక ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 2021-22కి రూ.5652 కోట్లు, 2022-23లో రూ.5652 కోట్లు అని వెల్లడించాయి. దీంతో 2021-22లో డిస్కమ్‌ల లోటు రూ.10623 కోట్లు, 2022-23లో రూ.10,927 కోట్లుగా వివరించాయి. దీనికితోడు 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరం కింద వాస్తవిక వ్యయం(ట్రూఅప్ ఛార్జీల కింద) కూడా రూ. వేల కోట్లలోనే ఉండనుంది.
డిస్కంలకు నష్టాలు క్రమంగా పెరుగుతుండటంతో ఛార్జీల పెంపు కోసం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడంతో ఆ భారాన్ని ఒకేసారి ప్రజలపై మోపాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఎవరికి ఎంత భారం వేయాలనేది డిస్కంలకు ప్రశ్నార్థకంగా మారింది. ఆదాయం వచ్చే వర్గాలపైనే కరెంటు చార్జీల పెంపు భారం ఉంటుందని ఇన్నాళ్లుగా ప్రభుత్వం చెబుతున్నా.. ఏ వర్గాలను టార్గెట్‌గా చేసుకొని డిస్కమ్‌లు ఆదాయాన్ని రాబట్టుకుంటారనేది చర్చనీయాంశమైంది. టారిఫ్ ఛార్జీలు ప్రకటించిన అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కరెంట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇళ్లతో పాటు, కమర్షియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలకు కూడా కరెంట్ ఛార్జీలు పెరగనున్నాయి.
నిజానికి కరెంట్ చార్జీలు పెంచుతామని రెండేళ్ల కిందటే సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేశారు. ఈ ప్రతిపాదనలు సమర్పించేలోపు కరోనా ముంచుకురావడంతో పక్కన పెట్టేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని సీఎం పునరుద్ఘాటించారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరెంట్ చార్జీల పెంపునకు ఆమోదం తెలుపవడంతో ఎట్టకేలకు డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు సమర్పించాయి. అయితే టారిఫ్ ప్రతిపాదనలు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరిధాన్యం కొనుగోలుపై రాష్ట్రవ్యాప్తంగా రగడ నెలకొనడంతోనే టారిఫ్ ప్రతిపాదనలు డిస్కమ్‌లు ఈఆర్సీకి ఏఆర్ఆర్తోపాటు ఏకకాలంలో అందించలేదని సమాచారం. కాగా, పెంచిన విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తారని తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.