అడుగంటిపోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్... బయటపడుతున్న పురాతన ఆలయాలు...

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో బయటపడుతున్న గతంలో ముంపునకు గురైన పురాతన ఆలయాలు, చారిత్రక ఆనవాళ్లు బయటపడుతున్నా

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 17, 2019, 7:55 PM IST
అడుగంటిపోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్... బయటపడుతున్న పురాతన ఆలయాలు...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో బయటపడుతున్న గతంలో ముంపునకు గురైన పురాతన ఆలయాలు, చారిత్రక ఆనవాళ్లు బయటపడుతున్నా
  • Share this:
కాలం ఎంతో విలువైంది.. పోయిన కాలం తిరిగి రాదు.. కాలగర్భంలో కలిసి ఎన్నో సంఘటనలు మళ్లీ తిరిగి రమ్మన్నారావు. చరిత్రలో కలిసిపోయిన వాటిని మళ్లీ చూస్తామని ఎవరూ ఊహించరు.. అయితే ఇక్కడ మాత్రం వందల ఏళ్ల క్రితం నీటమునిగిన పుణ్యక్షేత్రాలు ఇప్పుడు మళ్లీ దర్శనీయ స్థలాలుగా మారుతున్నాయి. తెలంగాణ వరప్రదాయినిగా పిలిచే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో గతంలో ముంపునకు గురైన పురాతన ఆలయాలు, చారిత్రక ఆనవాళ్లు బయటపడుతున్నాయి.. వందల ఏళ్ల నాటి పురాతన ఆలయాలు మళ్లీ వెలుగుచూస్తుండడంతో స్థానికులు పూజలు చేసేందుకు తరలివస్తున్నారు. వందల ఏళ్ల నాటి కుస్తాపూర్ రామలింగేశ్వర ఆలయం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద 1957లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1963లో అప్ప‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. 102 టీఎంసీల నీటి సామర్థ్యంతో 1091 అడుగుల ఎత్తులో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే పూడిక కారణంగా 90టీఎంసీల సామర్థ్యానికి పడిపోయింది. కానీ ఆనాడు ప్రాజెక్టు నిర్మాణంతో నిజామాబాద్ జిల్లాలోని 38 గ్రామాలు, ఆదిలాబాదు జిల్లా పరిధిలోని సుమారు యాభై గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇక్కడి ప్రజలను మరో చోటికి తరలించారు. ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ఆలయాలు, రోడ్లు, బురుజులు నీటిలో మునిగిపోయాయి.అయితే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. దీంతో దాదాపు 70 క్రితం నీటమునిగిన అవన్నీ బయటపడుతున్నాయి.

ఇందులో అత్యంత ప్రధానమైనది నందిపేట్ మండలంలోని కుస్తాపూర్ రామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. శ్రీరాముడు వనవాసంలో ఉండగా గోదావరి నదీ తీరంలో సంచరిస్తూ ఇక్కడ ఇసుకతో శివలింగాన్ని నిర్మించారని... ఆ తర్వాతే శ్రీరామునికి సంతానప్రాప్తి కలిగిందని నానుడి. రాత్రి వేళల్లో గంధర్వులు వచ్చి హారతి ఇచ్చేవారిని చరిత్రక ఆధారాలు చెప్తున్నాయి. క్రీ.శ. 1949 ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మంత్రులైన బాజీరావు పీష్వా ఇక్కడ స్నానఘట్టాలు, ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. శివాలయంతో పాటు దశరథుడు, గంగాభవాని, నాగేంద్రుడు, కాలభైరవుడు, ఎరుకల గుడి, హనుమంతుని ఆలయాలు నిర్మించారు. అయితే గోదావరి నది ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తూ దక్షిణ వాహినిగా ఈ ప్రాంతం అప్పట్లో విశేష ప్రాచుర్యం పొందింది. నైజాం పాలనలో ఉన్నప్పటికిని శివాజీ వంశీయులు ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడ సుమారు రెండు వందల బ్రాహ్మణ కుటుంబాలు నివసించేవి. నిత్య నైవేధ్యాలు, పూజలతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన రాతి కట్టడాలు నేటికీ చెక్కు చెదరలేదు. 18 రకాల రాతి కట్టడాలు దర్శనమిస్తున్నాయి. వీటిల్లో అప్పటి శిల్పకళా వైభవం ఉట్టిపడుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఈ ఆలయం బయటపడడం ఇది 8వ సారి. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తమ పూర్వీకులు ఆరాధించే ఆలయాన్ని దర్శించేందుకు క్యూ కడుతున్నారు.. ప్రత్యేక పూజలు చేసేందుకు వీలుగా శివారు గ్రామాల వారు ఆలయానికి రంగులు వేసి శుభ్రం చేశారు. స్వామికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి పండగ చేసుకుంటున్నారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలను తిరిగి దర్శనం తమకు కలగడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>