హోమ్ /వార్తలు /తెలంగాణ /

Asifabad: రూ.12 కోట్ల వ్యయంతో ఏడు కొత్త పోలీస్ స్టేషన్ భవనాలు.. ఘనంగా ప్రారంభోత్సవం

Asifabad: రూ.12 కోట్ల వ్యయంతో ఏడు కొత్త పోలీస్ స్టేషన్ భవనాలు.. ఘనంగా ప్రారంభోత్సవం

పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ

పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  రూ.12 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయం చేసి, అధునాతన హంగులతో ఏడు సరికొత్త పోలీసు స్టేషన్ భవనాలను నిర్మించారు. వీటిని మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు,  ఆదిలాబాద్)

తెలంగాణ పోలీసు (Telangana Police) వ్యవస్థ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి మహమూద్ అలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కొమురంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్ భవనాలను ఆయన ప్రారంభించారు. జిల్లాలో మొత్తం ఏడు నూతన పోలీసు స్టేషన్ భవనాలను మంత్రి ప్రారంభించారు. సుమారు 12 కోట్ల 50 లక్షల వ్యయంతో అత్యాధునిక హంగులతో ఈ భవనాల నిర్మాణం చేపట్టారు. కాగజ్ నగర్ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో రూరల్ పోలీస్ స్టేషన్ భవనం, 30 లక్షల వ్యయంతో సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. కాగజ్ నగర్ పర్యటనలో భాగంగా వీటిని ప్రారంభించిన మంత్రి కాగజ్ నగర పోలీసు స్టేషన్ ప్రాంగణం నుండి విర్చువల్ పద్దతిన వాంకిడి, కౌటాల, పెంచికల్ పేట్, చింతలమానే పల్లి పోలీసు స్టేషన్ భవనాలను ప్రారంభించారు.

ఒక్కో పోలీసు స్టేషన్ నిర్మాణానికి రెండున్నర కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేశారు. అనంతరం  కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రెబ్బెన మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని కూడా ప్రారంభించారు. అంతకు ముందు పోలీసు స్టేషన్ ఆవరణలో మంత్రులు మొక్కలు నాటాలు. పోలీస్స్టేషన్లో నిర్మించిన ఎస్‌హెచ్‌వో గదిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళ ఎస్ఐని  కుర్చీలో కూర్చోబెట్టి వేదపండితుల ఆశీర్వచనంతో అభినందించారు. స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కమ్ వెయిటింగ్ హాల్, యాంటె రూమ్తో పాటు ఎస్హెచ్వొ రూమ్, రైటర్ రూమ్, ఇంటర్వ్యూ గది, కమ్యూనికేషన్ రూమ్, సిసి కెమెరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్.పి సురేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ శాసన సభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోణప్ప, పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ఇంకా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ , అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధితో పాటు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చుకు వెనకాడకుండా నూతన భవనాలకు మంజూరు చేస్తున్నారని తెలిపారు.  ముఖ్యమంత్రి కేసిఆర్ దిశానిర్ధేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో వేలాది పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు.

First published:

Tags: Asifabad, Telangana, Telangana Police

ఉత్తమ కథలు