Home /News /telangana /

TELANGANA HIGH COURT TAKES SUO MOTU COGNIZANCE OF LAWYERS MURDER IN PEDDAPALLI SK

Telangana: లాయర్ల హత్యపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

కులదేవత గుడి కూలితే వామన్ రావ్ కూలిపోతాడు అని కుంటా శ్రీనివాస్ అనే వ్యక్తి హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ ఆడియో క్లిప్ కీలకంగా మారింది.

    లాయర్ వామన్ రావు దంపతుల హత్యపై తెలంగాణలో దుమారం రేగుతోంది. పట్ట పగలే నడిరోడ్డుపై లాయర్లలను హత్య చేయడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలే హత్య చేశారని విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో న్యాయవాదుల హత్యపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. జంట హత్యల కేసును సుమోటోగా స్వీకరించి.. తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

    న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమన్న తెలంగాణ హైకోర్టు.. ఈహత్య అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తమ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని.. హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని ఆదేశించింది.

    హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులు బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వామన్ ‌రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం వారిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

    మంథనిలో కుల దేవత గుడి వివాదమే హత్యకు కారణమని సమాచారం. కులదేవత గుడి కూలితే వామన్ రావ్ కూలిపోతాడు అని కుంటా శ్రీనివాస్ అనే వ్యక్తి హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ ఆడియో క్లిప్ కీలకంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కుమార్ , చిరంజీవి , దాస్ అనే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కుంటా శ్రీను కోసం గాలిస్తున్నారు. ఐతే ఈ హత్య కేసుతో టీఆర్ఎస్ నేత పుట్టా మధుకు హస్తముందని.. కుంటా శ్రీనుకు, పుట్టా మధుకు సంబంధాలు ఉన్నాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Telangana, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు