విద్యా సంవత్సరం మొదలు కాక ముందే ఆన్ లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపై విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదన్న ప్రభుత్వం... వాటిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వం ధ్వంద్వ వైఖరి తో దాగుడు మూతలు ఆడకూడదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోరని నిలదీసింది. ఇక విద్యార్థుల కెరీర్ కోసం నెల రోజులుగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నామన్న విద్యా సంస్థల తరఫు న్యాయవాది వాదించారు.
తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్తంభించిపోతుందని అన్నారు. అయితే ఒక్కో ఇంట్లో రెండు మూడు ల్యాప్ టాప్‌లు కొనే పరిస్థితి ఉందా ? అని హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవద్దని సూచిచింది. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. కార్మికులు, న్యాయవ్యవస్థతో పాటు ప్రపంచ మానవాళి జీవితమే స్తంభించిందని వ్యాఖ్యానించింది.
కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సిటీఈని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. కేంద్రం, సీబీఎస్ ఈ వాదనలు కూడా వింటామని తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 13కి వాయిదా వేసింది. అంతకుందు ముందు ఆన్లైన్ క్లాసులపై తమ వాదన వినిపించిన తెలంగాణ ప్రభుత్వం... ఆన్ లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ నెల 31వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపింది. ఈ నెల తర్వాతే విద్యా సంవత్సరంపై నిర్ణయం ఉంటుందని చెప్పింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.