కమిటీకి సర్కార్ నో... ఆర్టీసీపై విచారణ 18కి వాయిదా

ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

news18-telugu
Updated: November 13, 2019, 5:22 PM IST
కమిటీకి సర్కార్ నో... ఆర్టీసీపై విచారణ 18కి వాయిదా
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
ఆర్టీసీ సమ్మెపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 18కు వాయిదా వేసింది. అంతకుముందు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలతో కమిటీ వేయాలని సూచించిన హైకోర్టు ప్రతిపాదనకు ప్రభుత్వం ఒప్పుకోలేదని ఏజీ కోర్టుకు తెలిపారు. సమ్మె కేసు లేబర్ కోర్టులో ఉన్నందున కమిటీ అవసరం లేదని సర్కార్ వాదించింది. కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పింది. సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని మరోసారి కోర్టుకు వివరించారు అడ్వకేట్ జనరల్. అయితే సమ్మె చట్టవిరుద్ధం అని ఎలా చెబుతారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏజీ హైకోర్టు ముందుంచారు. 2015లో ఎస్మాపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9ని ప్రస్తావించారు. ఆరు నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు జీవోను పొడిగిస్తారని తెలిపారు. గతంలో ఇచ్చిన జీవో 180 అంశాన్ని కూడా ఏజీ ప్రస్తావించారు. అయితే ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవో 180 తెలంగాణకు వచ్చిందని హైకోర్టు స్పష్టంచేసింది.

ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం కమిటీ వేయాలని పిటిషనర్ తరపు లాయర్‌ రాపోలు కోర్టును కోరారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. సమస్యను తొందరగా పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 27 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. హైపవర్ కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని పిటిషనర్‌ తరపు లాయర్ కోర్టును వేడుకున్నారు. కానీ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిరాకరించిందని కోర్టుకు ఏజీ వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

First published: November 13, 2019, 4:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading