తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు తొలిగాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. నోటిఫికేషన్ ఇప్పటికే విడుదయిందని.. ప్రస్తుత దశలో ఎన్నికలను ఆపలేమని స్పష్టంచేసింది. రిజర్వేషన్‌ల ఆర్డినెన్స్‌పై స్టే విధించలేమని వెల్లడించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.
డిసెంబరులో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతంగా ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కలుపుకొని మొత్తంగా యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పెరిగిన బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 64 శాతానికి పెంచాలని మొదట భావించింది. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని న్యాయస్థానాలు స్పష్టం చేయడంతో..అందుకు తగినట్టే చట్టసవరణ చేసింది ప్రభుత్వం. ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నేత క్రిష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు, జనవరి 1న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 12,751 గ్రామాలకు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడత జనవరి 21న, రెండో విడత 25న, మూడో విడత ఎన్నికలు జనవరి 30న జరుగుతాయి. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుంది. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలను వెల్లడిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.