గణేశ్ నిమజ్జనంపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిమజ్జనంలో జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించింది. దీనిపై సెప్టెంబర్1లోపు నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, సీపీలకు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇళ్లలోనే మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయంలో సూచనలు చేయడంతో సరిపెట్టవద్దని.. స్పష్టమైన ఆదేశాలు ఉండాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించారు. సెంటిమెంట్ల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.
అంతకుముందు హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై ఈ నెల 11న కూడా హైకోర్టు విచారణ జరిపింది. గణేష్ నిమజ్జనంపై నిర్ణయం వెల్లడికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. గతేడాది ఆంక్షలు, నిబంధనల్లో సడలింపులు ఉండొద్దని కోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వినాయక నిమజ్జనంపై విచారణ ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది. అయితే ఈ రోజు కూడా ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో.. కేసు సెప్టెంబర్ 1కి వాయిదా పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.