హోమ్ /వార్తలు /తెలంగాణ /

Etala Rajendar: నేను నిప్పు.. దమ్ముంటే అలా చేయండి.. భూకబ్జా ఆరోపణలపై సర్కార్‌‌కు ఈటల సవాల్

Etala Rajendar: నేను నిప్పు.. దమ్ముంటే అలా చేయండి.. భూకబ్జా ఆరోపణలపై సర్కార్‌‌కు ఈటల సవాల్

ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి ఈటల రాజేందర్ తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తాను ఏ భూమిని కబ్జా చేయలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను కొన్నవి వ్యవసాయ భూములు కావని చెప్పారు.

ఇంకా చదవండి ...

  హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి ఈటల రాజేందర్ తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తాను ఏ భూమిని కబ్జా చేయలేదని, పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను కొన్నవి వ్యవసాయ భూములు కావని చెప్పారు. 2016లో జమున హెచరీస్ కోసం ఎకరం రూ.6 లక్షల చొప్పున 40 ఎకరాల భూమిని ఒకేసారి కొన్నామని మంత్రి చెప్పారు. కెనరా బ్యాంకు నుంచి రూ.100 కోట్లు రుణంగా తీసుకున్నట్లు ఈటల తెలిపారు. తాను తీసుకున్న భూముల చుట్టూ అసైన్డ్ భూములున్న విషయాన్ని సీఎంకు కూడా చెప్పానని, ఆ భూములన్నీ ఇప్పటికీ వాళ్ల దగ్గరే ఉన్నాయని మంత్రి ఈటల చెప్పారు. ముందస్తు ప్రణాళికతో, కట్టు కథతో తన క్యారెక్టర్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తాను కొన్నవి వ్యవసాయ భూములు కావని ఈటల చెప్పారు. అసైన్డ్ భూములు అమ్మవద్దని, కొనవద్దని తానే రైతులకు చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. రైతులే భూములను ప్రభుత్వానికి సరండర్ చేస్తూ లేఖలు ఇచ్చారని మంత్రి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్, విజిలెన్స్ డీజీతోనే కాకుండా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి మంత్రి ఈటల సవాల్ విసిరారు. ఎక్కడైనా తప్పు చేసినట్టు తేలితే శిక్షకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. తాను దొరనని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అంతకంటే నీచమైన ప్రచారం మరొకటి ఉండదని ఈటల వ్యాఖ్యానించారు. తాను ముదిరాజ్ బిడ్డనని, తన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని.. తన కొడుకు పేరు నితిన్ అని, తన భార్య నితిన్ రెడ్డి అని పేరు పెట్టుకుందని.. దొర పెత్తనాలకు, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిని తానని మంత్రి ఈటల గుర్తుచేశారు. లొంగే ప్రసక్తే లేదని, ఈటల నిప్పు అని మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

  ఇదిలా ఉంటే.. సరిగ్గా కొన్ని నెలల క్రితం.. మంత్రి ఈటల సొంత పార్టీపై నర్మ గర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వైఖరిపై పలు అనుమానాలకు తావిచ్చాయి. మంత్రి పదవి భిక్ష కాదని, గులాబీ జెండాకు తామూ ఓనర్లేమని మంత్రి ఈటల ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. మంత్రి ఈటల వ్యాఖ్యలకు మరో మంత్రి ఎర్రబెల్లి కౌంటరివ్వడం, గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం రచ్చకు దారితీసింది. మంత్రి ఈటల సొంత పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసంతృప్తితోనే ఆ తరహా వ్యాఖ్యలు చేశారనే ప్రచారం కూడా ఆ సమయంలో జోరుగా సాగింది. టీఆర్‌ఎస్‌లో ఇమడలేకే ఈటల ఇలా బాహాటంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈటల సొంత పార్టీ పెట్టనున్నారనే ప్రచారమూ నడిచింది. సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే.. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కేసీఆరే తమ నాయకుడని తన వ్యాఖ్యలపై ఈటల ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. దీంతో.. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఈటలను మంత్రివర్గ భేటీలకు ఆహ్వానించడం లేదని, ఆయన కూడా దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. దీనికి తోడు.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంలోనూ ఈటల ఎక్కడా కనిపించకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చింది.

  తాజా భూకబ్జా ఆరోపణలేంటి..? ఈ ఆరోపణలు చేసిందెవరు..?

  టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా కీలక పదవిలో ఉన్న ఈటల రాజేందర్ భూకబ్జాకు పాల్పడ్డారంటూ మెదక్ జిల్లాకు చెందిన 8 మంది రైతులు సీఎం కేసీఆర్‌కు లేఖ చేశారు. మంత్రి ఈటల తన భార్య జమున పేరిట హేచరీస్ కోసం అక్రమ రోడ్డు వేయిస్తున్నారని, ఆ హేచరీస్ కోసం వందల కోట్ల విలువైన వంద ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించుకుని.. ఆ భూముల్లో నుంచి ఫౌల్ట్రీ కోసం రోడ్డు వేశారని రైతులు ఆ లేఖలో పేర్కొన్నారు. తాము అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ మంత్రి మనుషులు దగ్గరుండి మరీ రోడ్డు వేయించారని రైతులు ఆరోపించారు. అంతేకాదు.. మంత్రి ఆక్రమించుకున్న భూములివేనంటూ సర్వే నంబర్లను సహా ఆ ఫిర్యాదులో స్పష్టంగా పొందుపరచడం గమనార్హం. మూసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో మంత్రి కబ్జా చేసిన తమ భూములను కాపాడి న్యాయం చేయాలని రైతులు కోరారు. మంత్రి ఈటల అధికారులపై ఒత్తిడి చేసి.. తన భార్య జమున, కుమారుడు నితిన్ పేర్ల మీద ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయించారని రైతులు ఆ లేఖలో తెలిపారు. మంత్రి ఈటలపై ఆరోపణలు చేసిన రైతులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. మూసాయిపేట మండలంలోని 130/5, 64/6, 130/10 సర్వే నంబర్లలోని భూమిని మంత్రి కబ్జా చేసినట్లు రైతులు ఆరోపించారు. ఇదిలా ఉంటే.. రైతులు చేస్తున్న ఈ ఆరోపణలు వెలుగులోకి రావడానికి మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి కారణమని తెలుస్తోంది.

  ఇది కూడా చదవండి: Etala Rajender: మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలు.. సీఎం కేసీఆర్ సంచలన ఆదేశాలు..


  ఈటలపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

  ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సమగ్ర విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈటలపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాలని విజిలెన్స్ డీజీకి కూడా సీఎం ఆదేశాలు పంపారు. ఇదిలా ఉంటే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఇప్పటికే జరగడం, మున్సిపల్ ఎన్నికలు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడం గమనార్హం.

  టీఆర్‌ఎస్ సొంత మీడియాలోనూ మంత్రి ఈటలపై వార్తా కథనాలు..

  మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జాకు పాల్పడ్డారంటూ టీఆర్‌ఎస్ సొంత మీడియాలోనూ వార్తలు రావడం రాజకీయ ప్రకంపనలకు తెరలేపింది. వందల కోట్ల విలువైన భూమిపై మంత్రి ఈటల రాజేందర్ కన్నేశారంటూ టీఆర్‌ఎస్ సొంత మీడియాలో కథనాలు రావడం కొసమెరుపు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన భూమిని మంత్రి హోదాలో గుంజుకోవాలని ఈటల రాజేందర్ ప్రయత్నించారంటూ వార్తలొచ్చాయి.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: CM KCR, Etela rajender, Minister Etela, Telangana, Trs

  ఉత్తమ కథలు