Telangana: గురుకులాలు తెరవొచ్చు -స్టే ఎత్తేసిన హైకోర్టు -రీఓపెనింగ్ తేదీలు ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కొనసాగుతున్నా, ఒక్క గురుకులాలపైనే ఆంక్షలు విధించడంపై విమర్శలు వెల్లువెత్తడం, కేసీఆర్ సర్కారు కూడా బడుల రీఓపెనింగ్ కు అనుమతివ్వాలని కోరడంతో తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. గురుకులాల రీఓపెనింగ్ పై స్టేను ఎత్తసింది..

  • Share this:
తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలను తెరిచేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తేదీలు దగ్గర పడుతుండటంతో గురుకులాల రీఓపెనింగ్ పై ఉన్న స్టేను ఎత్తేయాలని సర్కారు పదే పదే కోరడంతో కోర్టువారు కనికరించారు. బడులు తెరవొద్దంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ, గురుకులాలు తెరవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ సర్కారేనంటూ బుధవారం నాడు తీర్పు వెలువడింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గురుకులాలు తెరవొద్దని సెప్టెంబర్ నాటి విచారణలో కోర్టు స్టే విధించింది. దీంతో మిగతా విద్యా సంస్థలు కొవిడ్ నిబందనలు పాటిస్తూ తెరవొచ్చని ఆనాడే సర్కారు జీవోలిచ్చింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గడం, పరీక్షలు దెగ్గరపడటంతో సర్కారు మరోసారి పిటిషన్ వేసింది..

మిగతా విద్యా సంస్థల్లో కొవిడ్ నిబంధనలు అమలవుతున్నాయని, గురుకులాల్లో కూడా వాటిని కొనసాగిస్తామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టు దృష్టికి తెచ్చారు. సదరు వాదనతో ఏకీభవించిన జడ్జిలు... గురుకులాల్లో ఆన్ లైన్, ఆఫ్ లైన్ నిర్వహించుకోవచ్చని, గతంలో ఇచ్చిన స్టేను సవరించామని, బడులు ఎప్పుడు తెరవాలో ప్రభుత్వమే తేదీలు ప్రకటించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా, రీఓపెనింగ్ తేదీలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉండగా, గురువారం నుంచి లేదా సోమవారం నుంచి గురుకులాలు మళ్లీ తెరుకునే అవకాశాలున్నాయి.
Published by:Madhu Kota
First published: