భూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహశీల్దార్‌ను కాళ్లా వేళ్లా బతిమిలాడినా ఇప్పటికీ చాలా చోట్ల రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇలా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన రైతులు.. ఆత్మహత్యే శరణ్యమని ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల పెట్రోల్ బాటిల్‌తో తహశీల్దార్లను బెదిరిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్లో తహశీల్దార్‌ను ఓ రైతు సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కూడా ఎమ్మార్వోలు, వీఆర్కోవలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇలా ఎన్నో అక్రమాలు, అవినీతిని మూటగట్టుకున్న రెవెన్యూశాఖను ప్రక్షాళనుచేయాలని ఇది వరకే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తులు చేస్తున్నారు. భూ వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న 144 చట్టాలు లేదా నియమాల్లో కాలం చెల్లినవాటిని తొలగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త చట్టం రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్ అబ్నార్ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ కొత్త చట్టం తయారీపై కసరత్తులు చేస్తోంది. రెవెన్యూ ఉద్యోగుల సర్దుబాటు, హోదాల మార్పులు, చేర్పులు వంటి అంశాలపై ఉన్నతాధికారలు చర్చలు జరుపుతున్నారు. భూ వివాదాలు 45 రోజుల్లో పరిష్కారం కాకుంటే.. అర్జీని నేరుగా కలెక్టర్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు నివేదిస్తారు. అక్కడా తీర్పు సంతృప్తికరంగా లేకుంటే రెవెన్యూ కోర్టుకు అప్పీల్ చేసుకునేలా కొత్త విధానం తీసేకురానున్నారు.
కొత్త రెవెన్యూ చట్టంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోనున్నారు. దరఖాస్తుదారు అర్జీ దాఖలు చేసింది మొదలు.. సమస్య పరిష్కారం వరకు స్టేటస్ రిపోర్టును ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఏ అధికారి వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉంది? ఎందుకు ఉంది? అనే సమచారాన్ని దరఖాస్తుదారుడు తెలుసుకోవచ్చు. నూతన విధానం ద్వారా రైతుల భూ వివాదాలకు సులభంగా పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana