TELANGANA GOVT TO CONDUCT BLOCK WISE SUMMITS TO SOLVE DHARANI LAND ISSUES MAY PROVIDE SOME OTHER OPTIONS SK
Dharani Portal: రైతులకు శుభవార్త.. భూముల సమస్యలకు చెక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
Dharani Portal: ధరణి పోర్టల్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల స్థాయిలో సదస్సులను ఏర్పాటు చేయబోతోంది.
తెలంగాణలో భూముల క్రయవిక్రయాలను సరళతరం చేయడంతో పాటు భూరికార్డులను పక్కాగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal).. మరిన్ని కొత్త సమస్యలను కారణమైంది. భూరికార్డుల్లో చాలా చోట్ల తప్పులు దొర్లాయి. భూయజమాని పేరు, సర్వే నెంబర్, భూవిస్తీర్ణానికి సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లడంతో చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఐచ్ఛికాలను తీసుకొస్తోంది. భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు మండల స్థాయిలో సదస్సులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం త్వరలోనే ఒక కార్యాచరణ చేపట్టనుంది. సిద్దిపేట జిల్లా ములుగులో చేపట్టిన పైలట్ కార్యక్రమంలో రైతుల నుంచి వ్యక్తమైన అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Harish Rao), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం మంగళవారం ములుగు రైతువేదికలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా పరిశీలన చేపట్టింది. ఈ సందర్భంగా చాలా మంది రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ముందు ఉంచారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో పేర్ల తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సర్వే నంబర్లలో విభాగాలు, వారసత్వ పంపకాల్లో తేడాలు, పట్టా భూములు ప్రభుత్వానివని నమోదవడం లాంటి సమస్యలను వివరించారు.
రైతులతో మాట్లాడిన అనంతరం అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో మంత్రి, ఉన్నతాధికారులు కొత్త ఐచ్చికాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐఏఎస్ అధికారులు శేషాద్రి, రాహుల్ బొజ్జా, టీఎస్ టెక్నికల్ సర్వీసెస్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు చెప్పిన సమస్యలపై చర్చించారు. ధరణిలో తొమ్మిది రకాల ఐచ్ఛికాలు కల్పిస్తే అన్ని రకాల సమస్యలు తీరుతాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ధరణిలో అదనంగా చేర్చాల్సిన ఐచ్ఛికాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇక్కడి సమస్యలను పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి మండలంలోనూ భూ సమస్యలున్న వారి నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కరానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నారు. కోర్టు కేసులు, వ్యక్తిగత సమస్యలు లేనివాటిని గుర్తించి స్పష్టత తీసుకొచ్చి... వాటి వివరాలను ధరణి పోర్టల్‌లో చేర్చనున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు. వారంతా మండల స్థాయి కార్యక్రమాల్లో పాల్గొని రైతుల సమస్యలు తీర్చేందుకు సహకారం అందించేలా కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. దీనిపై అతి త్వరలోనే ప్రభుత్వం కార్యాచరణను రూపొందించనుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.