హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కృష్ణా నదిపై మరో ఆనకట్ట నిర్మాణం.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Telangana: కృష్ణా నదిపై మరో ఆనకట్ట నిర్మాణం.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ఆనకట్ట నిర్మాణంతో పాటు ఆయా ప్రాజెక్టుల కోసం సమగ్ర సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

  ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం ముదురుతోంది. ఏపీ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. చట్టవిరుద్ధంగా ఈ ప్రాజెక్టులు చేపట్టడం వల పాలమూరు జిల్లా ఎడారి ప్రాంతంగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం అనుమతులు మంజూరు చేసింది. ఇటీవలి కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆనకట్ట సర్వే కోసం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం జలాశయం ఎగువన కృష్ణా నదిలో తుంగభద్ర కలిసే ముందు గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు పరిధిలో ఆనకట్ట నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. కృష్ణా నదిలో 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేలా ఈ జోగులాంబ బ్యారేజ్ నిర్మించనున్నారు. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని నిర్ణయించింది.

  అంతేకాదు కృష్ణా నదికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ. వర్షాకాలంలో వరద సమయంలో రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద బీమా వరద కాల్వ నిర్మాణం చేపట్టనున్నారు. ఆ డ్యామ్ నుంచి జూరాల ఆయకట్టు పరిధిలోని గోపల్‌దిన్నె వరకు పలు రిజర్వాయర్లు, చెరువులకు నీటిని తలరించాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలంపూర్‌, గద్వాల ప్రాంతాల్లోని ఆర్డీఎస్‌, నెట్టెంపాడు ఆయకట్టు పరిధిలోని మిగిలిన 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు సుంకేశుల జలాశయం వద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించనున్నారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచబోతున్నారు. నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా పులిచింతల వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు, సాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.

  కొత్త ఆనకట్ట నిర్మాణంతో పాటు ఆయా ప్రాజెక్టుల కోసం సమగ్ర సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తెలంగాణ ప్ర‌భుత్వం రాసిన లేఖ‌కు కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) స్పందించిన విషయం తెలిసిందే. రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు త‌క్ష‌ణ‌మే ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (NGT) గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఇచ్చిన ఆదేశాల‌లో రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప‌నులు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని స్ప‌ష్టంగా చెప్పార‌ని ప్రస్తావించింది. KRMB నిపుణుల క‌మిటీ ప‌ర్య‌ట‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించ‌డం లేదని, తెలంగాణ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. డీపీఆర్‌లు స‌మ‌ర్పించి ఆమోదం పొందే వ‌ర‌కు రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నులు ముందుకు వెళ్లొద్దని ఏపీ ప్ర‌భుత్వానికి కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్ప‌ష్టం చేసింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Krishna River, Krishna River Management Board, Telangana

  ఉత్తమ కథలు