Telangana Governor Tamilisai | గవర్నర్ తమిళిసైపై తెలంగాణ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ 10 బిల్లులకు ఆమోదం తెలపడం లేదని చీఫ్ సెక్రెటరీ రిట్ పిటీషన్ వేశారు. ఈ రిట్ పిటీషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఈ పిటీషన్ పై రేపు విచారణ జరిగే ఛాన్స్ ఉంది. కాగా చాలా రోజులుగా 10 బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపకుండా తొక్కిపడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. 6 నెలలుగా కొన్నిబిల్లులు రాజ్ భవన్ లోనే ఉంటున్నాయని ప్రభుత్వ వర్గాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు 194 పేజీలతో కూడిన రిట్ పిటీషన్ లో ఈ విషయాలు వెల్లడించారు. కాగా కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రిట్ పిటీషన్ పై రాజ్ భవన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
దాదాపు సెప్టెంబర్ 14 2022 నుంచి గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లులు అన్నీ కూడా స్పష్టమైన ఆధిక్యంతో తీసుకొచ్చినవే అని పేర్కొంది. అయితే వీటిని గెజిట్ ద్వారా ఇవ్వలేకపోతున్నామని..ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్, ఖైతన్నపల్లి మున్సిపాలిటీ పేరు మార్పు బిల్లు, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇలా 10 బిల్లులను గవర్నర్ ఆమోదించేలా చూడాలని సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. కాగా పెండింగ్ బిల్లుల అంశంతోనే అటు రాజ్ భవన్ కు ఇటు ప్రగతి భవన్ కు మధ్య దూరం పెరిగింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగంతో దూరం తగ్గిందనుకున్న క్రమంలో ప్రభుత్వం పెండింగ్ బిల్లుల అంశాన్ని లేవనెత్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
కాగా అసెంబ్లీలో ఓ బిల్లుకు ఆమోదం తెలిపిన తరువాత అది శాసనమండలికి వెళ్తుంది. ఆ తరువాత అక్కడ ఆమోదం అనంతరం గవర్నర్ వద్దకు వెళ్తాయి. వాటిని గవర్నర్ పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లులు సక్రమంగా లేకపోతే వాటిని గవర్నర్ ఆపే అధికారం ఉంటుంది. అయితే గతంలో పెండింగ్ బిల్లులపై గవర్నర్ స్పందించారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు.
మరి ఈ పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Governor Tamilisai, Supreme Court, Telangana