తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం... 5,100 రూట్లలో ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కేబినెట్‌లో కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడం... కోర్టు సైతం ఈ అంశంపై 11 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పర్మిట్ల వ్యవహారంపై న్యాయ పరమైన చిక్కులు రాకుండా ఏం చేయాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రైవేటు పర్మిట్లకు న్యాయపరమైన సమస్య ఎదురైతే... తెరపైకి లీజు పద్ధతిని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రైవేట్ పర్మిట్ల స్థానంలో లీజు పద్ధతిని తీసుకురావడం వల్ల న్యాయపరమైన చిక్కుల ఉండవని... లీజు గడువు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర 2,100 అద్దె బస్సులు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా లీజు పద్ధతిలో మరికొన్ని బస్సులకు పర్మిట్లు ఇస్తే... ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. లీజు పద్ధతి అంశంతో పాటు 11న కోర్టుకు సమర్పించాల్సిన నివేదిక ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా సీఎం కేసీఆర్ రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీతో సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Tsrtc, Tsrtc privatization